
- బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వ్యాఖ్య
కరీంనగర్ టౌన్, వెలుగు: డీలిమిటేషన్లో భాగంగా దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దక్షిణాది నుంచి కేంద్రం నిధులు తీసుకెళ్లినా భరిస్తున్నామని.. సీట్లు తగ్గిస్తే మాత్రం ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. గురువారం కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 1971 సెన్సెస్ ఆధారంగానే ఎంపీ సీట్ల పునర్విభజన జరగవచ్చనని ఆయన అన్నారు.
అందుకే ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సీట్లు తగ్గవని ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పుడున్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది కంటే దక్షిణ భారతంలో సీట్లు తగ్గుతాయని, తమిళనాడు సీఎం స్టాలిన్ మాటల్లో నిజముందన్నారు.
చంద్రబాబు కూడా మరింత ముందుకెళ్లి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గకూడదన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ 1971 సెన్సెస్ప్రకారమే 20 ఏండ్ల వరకు ఎంపీ స్థానాలు కొనసాగాలని రాజ్యాంగ సవరణ చేశారని, ఈ గడువును మరో 25 ఏండ్లు పొడిగిస్తూ 2001లో వాజ్‌పాయ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిందన్నారు. ఈ గడువు 2026తో ముగుస్తుందని, తిరిగి రాజ్యాంగ సవరణ చేయాలన్న ఉద్దేశంతోనే అమిత్‌షా దక్షిణాదిలో సీట్లు తగ్గవని ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నానని పేర్కొన్నారు.