
వరంగల్, వెలుగు: ‘స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఊరురా భూములున్నాయ్.. మేము చాలెంజ్ చేసి చెబుతున్నాం.. నీ ఆంధ్రా అల్లుడు, ఇతర బినామీ పేర్లతో రాంపూర్ వద్ద పెట్రోల్ బంక్, పక్కనే ఆర్‍ఎంసీ ప్లాంట్ ఉంది. దేవునూరులో 21 ఎకరాలు కొన్నావు, ముప్పారంలో నెలన్నర కింద మరో 25 ఎకరాలు కొన్నావు, రఘునాథపల్లి మేకలగట్టులో 25 ఎకరాలు, జఫర్‍గఢ్‍లో 100 ఎకరాలను వెంచర్ల పేరుతో కబ్జా చేయబోతున్నావ్’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తో బాలసముద్రం పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరికి దేవునూరులో భూములు లేకుంటే దగ్గరుండి వ్యవసాయం ఎలా చేయించారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే బీఆర్‍ఎస్ కండువాతో గెలిచిన పదవికి రాజీనామా చేయాలన్నారు. కడియం శ్రీహరికి హనుమకొండలో ఒకటి, హైదరాబాద్‌లో మూడు, అమెరికాలో మూడు ఇండ్లు ఎలా వచ్చాయో? చెప్పాలని డిమాండ్ చేశారు.
కడియం తనను పిచ్చికుక్క, బొచ్చు కుక్క అంటున్నారని.. ఆయన ఏ కుక్కనో ఆయన గురువు రేవంత్‍రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయని పల్లా చెప్పారు. కడియం రాజీనామా చేసి మరోసారి గెలిస్తే.. ఇక అతని గురించి మాట్లాడబోనన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే కడియం శ్రీహరి ఆ పార్టీలోకి పోతారని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‍ను మోసం చేశాడని.. ఇప్పుడు అలాగే రేవంత్‍రెడ్డిని సైతం మోసం చేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఉన్నారు.