
- ప్రమాదంపై సీఎం ఎప్పటికపుడు రివ్యూ చేస్తున్నారు
- విప్ అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శనివారం గాంధీ భవన్ లో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. ఎల్ఎల్ బీసీ ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. అయినా సీఎంను తిట్టడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోతే.. ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, బీఆర్ఎస్ మంత్రులు బాధిత కుటుంబాలను పరామర్శించలేదని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఎస్ఎల్‌బీసీ ఘటనపై సీఎం రేవంత్ ను విమర్శించడం ఏమిటని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎస్ఎల్‌బీసీ ఘటనపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆ పార్టీ శవ రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.