- జడ్చర్లలో రెచ్చిపోతున్న అధికార పార్టీ లీడర్లు
- ఎలక్షన్ టైంలో దెబ్బతింటున్న నియోజకవర్గ లీడర్ ఇమేజ్
- పబ్లిక్‌తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్న అపోజిషన్ లీడర్లు
మహబూబ్‌నగర్, వెలుగు : రూలింగ్ పార్టీకి చెందిన కొందరు లీడర్లు రెచ్చిపోతున్నారు. అవినీతి, అక్రమాలపై ఎవరూ ప్రశ్నించినా, ఎదురు మాట్లాడినా వారిపై తిరగబడుతున్నారు. పబ్లిక్‌తో పాటు అపోజిషన్ పార్టీల లీడర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, దాడులకు దిగుతున్నారు. వీరి వ్యవహార శైలితో నియోజకవర్గాల లీడర్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా కేర్ చేస్తలేరు. కొద్ది రోజుల్లోనే ఎలక్షన్లు జరుగనున్నా జబర్దస్తీకి దిగుతుండడంతో ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న చర్చ జరుగుతోంది.
రుబాబ్ చేస్తున్రు..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కొందరు లీడర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఈ ఏడాది జనవరి 22న 35 ఏండ్ల కింద అమ్మిన ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేశారు. ప్లాట్లను చదును చేసి కొత్తగా వెంచర్ వేసే ప్రయత్నం చేయగా, బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై బాధితులు సదరు లీడర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో సమస్య సీరియస్ అయ్యింది. నియోజకవర్గ లీడర్ బాధితులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది. మే 19న జడ్చర్లలోని ఓ వార్డులో మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో పనులు చేయిస్తుండగా, అక్కడికి కొందరు లీడర్లు చేరుకున్నారు. పనులు చేస్తున్న మహిళా కార్మికులను తిట్టారు. ‘మా వార్డులోకి ఎందుకొచ్చావ్’ అంటూ కమిషనర్‌ను తిట్టారు.
దీంతో ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేయడంతో, వారిపై కేసు నమోదు చేశారు. మంగళవారం బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూలింగ్ పార్టీకి చెందిన ఒక లీడర్ రెచ్చిపోయారు. ప్రొటోకాల్ గురించి మాట్లాడిన బీజేపీ కౌన్సిలర్ చొక్కా పట్టుకొని తోసేయడం దూమారం రేపింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.
దెబ్బతింటున్న ఇమేజ్..
జడ్చర్లలో ఆక్రమణలు, భూ దందాల వ్యవహారాలు తరచూ బయటకు వస్తున్నాయి. బాధితులు ధర్నాలు, ఆందోళనలు చేసిన ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు లీడర్లు చేస్తున్న పనులకు జడ్చర్ల నియోజకవర్గ లీడర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అధికార పార్టీ లీడర్లే అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో, మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు వివిధ రకాల స్కీంలను అమలుచేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, ఇతర ఇక్వేషన్స్ ప్రకారం పోటీలో ఉండే అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటూ అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ లీడర్లకు చెప్పారు. వ్యతిరేకత రాకుండా పనులు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు నియోజకవర్గాల రిపోర్ట్ తనకు వస్తుందని పేర్కొన్నారు. అయితే జడ్చర్లలో లీడర్లు చేస్తున్న రుబాబ్కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే టాక్ వస్తోంది.
పబ్లిక్‌లోకి అపోజిషన్ లీడర్లు..
ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో అపోజిషన్ లీడర్లు పబ్లిక్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే కొందరు పాదయాత్రల పేరుతో తిరుగుతున్నారు. ఎలక్షన్ మోడ్‌లోకి వెళ్లి, ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, స్థానిక సమస్యలపై గళం విప్పుతున్నారు. ప్రజలను పలకరిస్తూ వారి అవసరాలను తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామనే విషయాలను వివరిస్తున్నారు. ఈ తరుణంలో నియోజకవర్గ లీడర్ నిత్యం ప్రజలకు టచ్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, జడ్చర్లలో అనుచరుల తీరుతో నియోజకవర్గ లీడర్‌కు ఎఫెక్ట్ పడుతుందని పబ్లిక్ చర్చించుకుంటున్నారు.