
కౌడిపల్లి, వెలుగు : ప్రజాపాలనలో భాగంగా శుక్రవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకుండా గ్రామ సభ ఎలా ప్రారంభిస్తారని స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో శ్రీనివాస్‌ను సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి నిలదీశారు. ఎంపీటీసీ స్థానంలో ఆమె భర్తను స్టేజ్ పై కూర్చోబెట్టి సర్పంచ్‌ను అవమానించడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఎంపీడీవోతో అరగంట పాటు గొడవకు దిగి గ్రామసభను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకులు ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని లేదంటే సభ నిలిపివేయాలని ఎంపీడీవోతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న చిలప్చెడ్ఎస్ఐ రమేశ్, కౌడిపల్లి పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి ప్రజాపాలన సభను నిర్వహించారు.