జగిత్యాల బీఆర్ఎస్‌‌‌‌లో  టికెట్ ఫైట్

  •       తమకే సీటు ఇవ్వాలని పార్టీ పెద్దలకు వినతులు
  •     తెరపైకి జితేందర్ రావు, వోరుగంటి రమణారావు, దావ వసంత 
  •     టికెట్ ఫైట్‌‌‌‌తో అయోమయంలో క్యాడర్

జగిత్యాల, వెలుగు : ఎన్నికలు దగ్గర పడ్తుండగా జగిత్యాల బీఆర్ఎస్‌‌‌‌లో టికెట్​ఫైట్​నడుస్తోంది. జగిత్యాల అసెంబ్లీ సీటు తమకే ఇవ్వాలంటూ కొందరు ఉద్యమకారులు పట్టుబడుతున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి వినతులు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొందరు సీనియర్ లీడర్లు, ఉద్యమ నేతలతో కొన్ని రోజులుగా సీక్రెట్ మీటింగులు నిర్వహిస్తున్నారు. గతంలో టికెట్ ఆశించిన నేతలు కూడా పార్టీ స్టేట్ లీడర్లను కలిసి టికెట్ తమకే ఇవ్వాలని విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.  మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారుల్లో కొందరితో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు పొసగడం లేదన్న టాక్ నడుస్తోంది. సీటుకోసం ఫైట్​జరుగుతుండడంతో ఎమ్మెల్యే వర్గం ఆందోళన చెందుతోంది. 

ఆశావహుల సీక్రెట్ మీటింగులు

కొన్ని రోజులుగా ఉద్యమ నేతలు, బీఆర్ఎస్ అసంతృప్తి వర్గం సీక్రెట్ మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఉద్యమ నేత, సీనియర్ లీడర్ జితేందర్‌‌‌‌‌‌‌‌రావుకు టికెట్ కేటాయించేలా హైకమాండ్‌‌‌‌పై ఒత్తిడి పెంచేందుకే ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నారన్న టాక్​వినిపిస్తోంది. దీంతోపాటు ఆయనకు సీఎంతో సాన్నిహిత్యం ఉండడంతో ఈసారి టికెట్ వస్తుందని ఆయన వర్గం ఆశిస్తోంది. మరో లీడర్ వోరుగంటి రమణరావు కూడా గతంలో రెండు సార్లు టికెట్ ఆశించారు.

ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఓ మంత్రి సాయంతో సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి విన్నవించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవితతో సాన్నిహిత్యం ఉండడంతో జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్​దావ వసంత కూడా రేసులో ఉన్నట్లు వినికిడి. బీసీ సామాజికవర్గానికి టికెట్​ఇవ్వాల్సి వస్తే వసంతకే అవకాశం వస్తుందని ఆమె అనుచరులు భావిస్తున్నారు. 

అయోమయంలో క్యాడర్ 

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు పోటీగా ఉద్యమ నేత జితేందర్ రావు, సీనియర్ లీడర్ వోరుగంటి రమణారావుతోపాటు మరికొందరు టికెట్ కోసం ప్రయత్నాలు చేయడంతో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. గతంలో జగిత్యాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ వైఖరిని తప్పుపడుతూ ఉద్యమకారులు ఎమ్మెల్సీ కవితకు ఫిర్యాదు చేయగా.. ఆమె ఇరువర్గాలకు నచ్చజెప్పారు.

ఇన్నాళ్లు సైలెంట్‌‌‌‌గా ఉన్న ఉద్యమ నేతలు సీక్రెట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం క్యాడర్‌‌‌‌‌‌‌‌ ఆందోళనకు గురవుతోంది. జగిత్యాల నియోజకవర్గం లో చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రెండోసారి గెలవాలని చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌.. సీనియర్ల ప్రయత్నాలను జీర్ణించుకోలేకపోతున్నారు.