
- ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు రాజీనామా
- కాంగ్రెస్, బీజేపీలోకి పెరిగిన వలసలు
- టెన్షన్ లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హనుమకొండ/పరకాల, వెలుగు : పరకాల నియోజకవర్గంలో గెలుపు ధీమాతో ఉన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి షాక్ ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కొద్దిరోజుల కింద శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివిధ గ్రామాలకు వెళ్లగా స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో కంగుతిన్న ఆయన ప్రచార కార్యక్రమాలకు బ్రేక్ వేసుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సన్నిహితులుగా పేరున్న లీడర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం ఆయనను కలవరపెడుతోంది. మొన్నటికి మొన్న ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీటీసీ సహా మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా పరకాల ఎంపీపీ కూడా రాజీనామా లెటర్ రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీలో కీలకమైన లీడర్ల వరుస రాజీనామాలు, కాంగ్రెస్ లో పెరుగుతున్న చేరికలు ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
ఎంపీపీలు, జడ్పీటీసీలతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పరకాల నియోజకవర్గంలో వరుస రాజీనామాలు తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, సంగెం, గీసుగొండ, దుగ్గొండ మండలాలు ఉండగా.. ఆయా మండలాల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంట్రాక్టుల విషయంలో ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణి అవలంబించడంతో పాటు కేవలం ఒకరిద్దరి సపోర్ట్ తో మిగతా క్యాడర్ ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది మండల స్థాయి నేతలు ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల కిందట ఆత్మకూరు ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ సభ్యురాలు కక్కెర్ల రాధికరాజు, నీరుకుల్ల ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ పార్టీ మారారు. వారు కాంగ్రెస్ లో చేరుతున్నారన్న సమాచారం అందగానే ఎమ్మెల్యే .. వాళ్లందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ తో ప్రకటన విడుదల చేయించారు.
అనంతరం గీసుగొండ మండలానికి చెందిన కొందరు ఎంపీటీసీలు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆ తరువాత ఆత్మకూరు ఎంపీటీసీ సభ్యులు బయ్య రమ, బయ్య రాజు మరికొందరు మంగళవారం పార్టీ మారారు. వీళ్లంతా స్థానికంగా మంచి పట్టున్న నాయకులు కావడం, ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో పార్టీ మారడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. మరికొందరు నేతలు కూడా అదే దారిలో పయనిస్తున్నారు. తాజాగా పరకాల ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత కూడా బీఆర్ఎస్ ను వీడారు. దళితబంధు, గృహలక్ష్మి తదితర పథకాల పేరుతో ఎమ్మెల్యే ధర్మారెడ్డి మోసం చేశారని, తమపై కేసులు పెట్టించి వేధిస్తున్నందువల్లే పార్టీని వీడుతున్నట్లు ఆమె రాజీనామా లెటర్ రిలీజ్ చేశారు. ఆమెతో పాటు పరకాల మండలంలోని లక్ష్మీపురం, వెంకటాపురం, వెల్లంపల్లి తదితర గ్రామాలకు చెందిన నేతలు కూడా రాజీనామా చేసినట్లు అందులో పేర్కొన్నారు. వారితో పాటు మిగతా మండలాల నుంచి కూడా మరి కొంతమంది పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్, బీజేపీ బాటపడుతున్న నేతలు
పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్న లీడర్లు కాంగ్రెస్, బీజేపీ బాటపడుతున్నారు. ఇప్పటికే ఆత్మకూరు ఎంపీపీ, జడ్సీటీసీ సహా మిగతా నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరగా.. మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో కొద్దికొద్దిగా కారు పార్టీ ఖాళీ అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ తూర్పుతో పాటు పరకాల నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు, క్యాడర్ ఉన్న ఓ బీఆర్ఎస్ లీడర్ కూడా పార్టీ వీడనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆహ్వానం మేరకు ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండడం, లీడర్లు ఒక్కొక్కరిగా దూరం అమవుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ క్యాడర్ తో ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్లో మహిళలకు గౌరవం లేదు
పరకాల ఎంపీపీ తాళ్లపల్లి స్వర్ణలత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆమె రాజీనామా లెటర్ విడుదల చేశారు. తనతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లీడర్లంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు అందులో ఆమె పేర్కొన్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన తనను ఎమ్మెల్యే ధర్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక అవమానాలకు గురిచేశారని, ఇబ్బందిపెట్టారని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో అగ్రకుల నాయకులకే చోటు ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానం లేకుండా పోయిందన్నారు.
దళితబంధు, గృహలక్ష్మి పథకం కింద నిరుపేదలందరికీ ఇండ్లు వస్తాయని ధర్మారెడ్డి మోసం చేశారని ఆరోపించారు. తన ఎదుగుదలను ఓర్వలేక కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసినందుకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రెండు, మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని లెటర్ లో వెల్లడించారు. - ఎంపీపీ స్వర్ణలత