- ఆ పని చేసేందుకు టీం ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు
పెద్దపల్లి, వెలుగు : ప్రచారానికి పోయిన చోట్ల జనం తమను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఫొటోలు, వీడియోలు తీయనివ్వడం లేదు. పెద్దపల్లి జిల్లాలో ప్రచారానికి పోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు అడ్డుకున్న వీడియోలు, ఫొటోలు పలు పత్రికలు, చానెళ్లలో వస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్టులు తప్ప వేరే ఎవరినీ ఫొటోలు, వీడియోలు తీయనివ్వకుండా ఆయా అభ్యర్థులు ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి ఎక్కడికి పోయినా అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఇంటీరియల్ ఏరియాలో ప్రచారం చేస్తుండగా.. ఆ ప్రచారానికి ఏ పత్రిక, చానల్ విలేఖరులు కూడా హాజరు కాలేదు.
అయినా మరుసటి రోజు పత్రికల్లో ఆ వార్త రావడంతో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి తన అనుచరులు, పార్టీ కార్యకర్తలపై గరం అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు తప్ప ఎవరినీ ఫొటోలు, వీడియోలు తీయకుండా చూడాల్సిన బాధ్యత కొంత మందితో ఏర్పాటు చేసిన టీంకు అప్పగించినట్లు తెలిసింది.