రాజ్యాంగాన్ని కాపాడండి..గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి

రాజ్యాంగాన్ని కాపాడండి..గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి
  • రాజ్​భవన్​లో గవర్నర్​తో కేటీఆర్ బృందం భేటీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్ రాధాకృష్ణన్​ను బీఆర్ఎస్ నేతలు కోరారు. నిరుద్యోగ యువత, విద్యార్థులపై దాడులు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు శనివారం రాజ్​భవన్​లో గవర్నర్​కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం రాజ్​భవన్​ఎదుట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్​కు వివరించామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తెలియజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ.. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేసి కేసులు పెడుతున్నట్టు చెప్పామన్నారు. ఉద్యమ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను యూనివర్సిటీల్లో చూస్తున్నామని కేటీఆర్ ఆరోపించారు. 

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కుతున్నరు

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘‘బీఆర్ఎస్​కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయ పోరాటం చేస్తున్న విషయాన్ని, స్పీకర్​ను కలిసి అభ్యర్థించిన విషయాన్ని గవర్నర్​కు తెలియజేశాం”అని కేటీఆర్​ తెలిపారు.