- ఇద్దరు సర్పంచులపై కేసు నమోదు
కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాణిక్యారం సమీపంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ లీడర్, ఎంపీపీ భర్త, చీమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు, మాణిక్యారం సర్పంచ్ భూక్యా రంగారావుతో పాటు మరో ఐదుగురి పై కారేపల్లి పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు, ఫారెస్టు ఆఫీసర్ల కథనం ప్రకారం..చీమలపాడులోని అటవీ భూముల్లో పర్మిషన్ లేకుండా బోరు వేస్తున్నారనే సమాచారం రావడంతో శనివారం రాత్రి సెక్షన్ ఆఫీసర్ దేవర రమేశ్, బీట్ ఆఫీసర్ నక్కబోయిన రమేశ్మరో ముగ్గురు బేస్ క్యాంప్ సిబ్బంది జీపులో చీమలపాడు వైపు బయల్దేరారు.
చీమలపాడు సర్పంచ్ కిషోర్, మాణిక్యారం సర్పంచ్ రం గారావు, మరికొందరు గుడితండా, మాణిక్యారం గ్రామాల మధ్య ఉన్న మూలమలుపు వద్ద కారు, బైక్ పెట్టి అడ్డగించారు. ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేశారు. సెక్షన్ ఆఫీసర్ రమేశ్ చేతికి గాయమైంది. అటవీ భూమిలోనుంచి బోర్ వాహనం వెళ్లిపోయిన తర్వాత ఫారెస్ట్ అధికారులను వదిలిపెట్టారు. వారి ఫిర్యాదుతో కారేపల్లి ఎస్ఐ రామారావు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.