జడ్జి కుటుంబసభ్యులపై బీఆర్ఎస్ నేతల దాడి

జడ్జి కుటుంబసభ్యులపై బీఆర్ఎస్ నేతల దాడి

హాస్పిటల్‌‌కు వెళ్తుండగా తమను అడ్డుకున్నారని ఫిర్యాదు 

గండీడ్, వెలుగు : నారాయణపేట జిల్లా కోస్గి కోర్టు మేజిస్ట్రేట్ పర్వీనా బేగం కుటుంబసభ్యులపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా గండీడ్‌‌ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్‌‌పై పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌‌నగర్‌‌‌‌, చించోలి రోడ్డుపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో పక్షవాతంతో బాధపడుతున్న జడ్జి పర్వీనా బేగం మామను ఆమె కుటుంబసభ్యులు కారులో హైదరాబాద్‌‌కు తరలిస్తుండగా, బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు అడ్డుకున్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, తాము అర్జెంట్‌‌గా హాస్పిటల్‌‌కు వెళ్లాలని జడ్జి భర్త వారిని కోరాడు. 10 నిమిషాలు వెయిట్‌‌ చేయాలని బీఆర్​ఎస్​ నేతలు కోరగా, వారు సరేనన్నారు. 

కొద్దిసేపటి తర్వాత వారు వెళ్లేందుకు ప్రయత్నించగా, బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు పెంట్యా నాయక్‌‌తో పాటు కృష్ణయ్య, వెంకట్రాములు, మల్లేశ్‌‌ జడ్జి భర్తతో పాటు కుటుంబసభ్యులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో వచ్చిన హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ కృష్ణారెడ్డిపై కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు దాడి చేశారు. తర్వాత జడ్జి భర్త బీఆర్​ఎస్​నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, జడ్జి కుటుంబసభ్యులతో పాటు కృష్ణారెడ్డి తమపై దాడి చేశారని బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు కంప్లయింట్‌‌ ఇచ్చారు.