మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని.. టవర్ ఎక్కిన బీఆర్ఎస్​ లీడర్లు

నర్సాపూర్, వెలుగు : ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని, లేకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటామని మెదక్​ జిల్లా కొల్చారం మండల బీఆర్ఎస్ లీడర్లు  మంగళవారం నర్సాపూర్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్​చల్​ చేశారు. మండల యూత్ ప్రెసిడెంట్ సురేశ్​ గౌడ్, బీఆర్ఎస్​ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సోషల్ మీడియా ఇన్​చార్జ్ రవీందర్, దిగంబర్, నాగరాజ్, అన్వేషక్  టవర్​ ఎక్కి ఎమ్మెల్యే కు మద్దతుగా నినాదాలు చేశారు. 

మదన్​రెడ్డికి ఫోన్ చేసి తాము టవర్ ఎక్కామని, సూసైడ్ ​చేసుకుంటున్నామని, తమ కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులను అక్కడికి పంపించారు. వారు వచ్చి ఎంత నచ్చచెప్పినా వినలేదు. దీంతో సీఐ షేక్ లాల్ మదర్, ఎస్సై శివకుమార్ వచ్చి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యే మదన్​రెడ్డి స్వయంగా అక్కడికి వచ్చి టవర్ ఎక్కిన వారికి నచ్చజెప్పి కిందికి దించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు ఇలాంటి పనులు చేయొద్దని, సీఎం కేసీఆర్ అండదండలు తనకే ఉన్నాయని, టికెట్ రావడం పక్కా అని ఆందోళన చెందవద్దన్నారు. టికెట్ వదిలేసే ప్రసక్తి లేదన్నారు.