హిమాన్ష్ కు జిందాబాద్ లు : బీఆర్ఎస్ లీడర్ల ఓవరాక్షన్

  • ఆయన నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు 
  • యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ లీడర్ల ఓవరాక్షన్​
  • డ్రోన్ ఎగురవేసినా పట్టించుకోని పోలీసులు 

యాదాద్రి/ యాదగిరిగుట్ట, వెలుగు: అతను మంత్రి కాదు.. ఎమ్మెల్యే  అంతకన్నా కాదు..కేవలం స్టూడెంట్.. కానీ, సీఎం కేసీఆర్ మనవడు కావడం, మంత్రి కేటీఆర్ ​కొడుకు కావడంతో బీఆర్​ఎస్​ లోకల్​ లీడర్లు హంగామా చేశారు. ముగ్గురు స్నేహితులతో కలిసి బుధవారం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం కోసం యాదగిరి గుట్ట వచ్చిన హిమాన్ష్ కు స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లీడర్లు పటాకులు కాల్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు. అంతటితో ఆగకుండా ‘హిమాన్ష్  జిందాబాద్..హిమాన్ష్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

వైకుంఠ ద్వారం ఎదురుగా యాదగిరి గుట్ట రింగ్ రోడ్డు పైనే వెహికల్ ఆపి శాలువాలతో సన్మానించారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయినా పోలీసులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సాయంత్రం 6:45 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 నిమిషాల పాటు గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి హిమాన్షు ప్రత్యేక పూజలు చేయగా, అప్పటివరకు భక్తుల దర్శనాలు నిలిపివేశారు. రూల్స్ కు విరుద్ధంగా కొండపై హిమాన్షు, వెంట వచ్చిన సిబ్బంది.. ఆలయ రూల్స్ బ్రేక్ చేస్తూ యథేచ్ఛగా డ్రోన్ కెమెరా ఎగరవేశారు. వాహన కాన్వాయ్ ద్వారా కొండపైకి వచ్చిన హిమాన్షు..లిఫ్ట్ ద్వారా ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుని, పశ్చిమ 
రాజగోపుర మార్గం నుంచి ఆలయంలోకి వెళ్లే వరకు డ్రోన్ ద్వారా షూట్ చేశారు.

హిమాన్షు ఆలయంలోకి వెళ్లిన తర్వాత కూడా స్వయంభూ నారసింహుడు కొలువై ఉన్న ప్రధానాలయంపై కూడా డ్రోన్ ను ఎగరేసి షూట్ చేశారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఆఫీసర్లు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరించారు. నిబంధనలు ప్రకారం అనుమతి లేనిదే ప్రధానాలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరేసి షూట్ చేయకూడదు. గత నెలలో ఇలాగే డ్రోన్ కెమెరాలు ఎగరేసిన వారికి ఆలయ సిబ్బంది ఫైన్ వేసి.. కేసులు నమోదు చేశారు. పూజల తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్లిన హిమాన్ష్ అతడి స్నేహితులు కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని వెళ్లిపోయారు. పోలీసులయితే సీఎం కేసీఆర్,. మంత్రి కేటీఆర్ వచ్చినట్టుగానే వ్యవహరించారు.