- ‘కులగణన’ రీసర్వే చేయించాలి: బీఆర్ఎస్ నేతలు
- 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి
- సీఎస్ శాంతి కుమారికి వినతిపత్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు బీసీల సంఖ్యను తగ్గించి వారి గొంతు కోసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కులగణనను రీసర్వే చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు సెక్రటేరియెట్‌లో సీఎస్ శాంతి కుమారిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 53 శాతం ఉంటే.. కేవలం 46 శాతంగానే చూపించారని మధుసూదనా చారి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సీఎస్‌ను కోరామన్నారు.
తమిళనాడులో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ మాత్రం పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణను రీసర్వే చేయించాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ భేషజాలు, మొండితనానికి పోకుండా డెడికేషన్ డే ప్రకటించి రీ సర్వే జరిపించాలన్నారు. ఆ వెంటనే వివరాలను బయటపెట్టి.. మూడు రోజులు అభ్యంతరాలు తీసుకోవాలని, ఆ తర్వాత తుది నివేదికను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశంలో జనాభా పెరుగుతున్నదే తప్ప.. తగ్గడమన్నదే లేదన్నారు. పార్లమెంట్లో ప్రతిరోజూ రాజ్యాంగం పట్టుకునే రాహుల్ గాంధీకి.. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలను తొక్కేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఓటర్ లిస్ట్ కంటే సర్వేలో బీసీల సంఖ్య ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.