పనామా చౌరస్తాలో మట్టి బ్రిడ్జి వద్దు: బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల డిమాండ్

పనామా చౌరస్తాలో మట్టి బ్రిడ్జి వద్దు: బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల డిమాండ్

ఎల్ బీనగర్,వెలుగు: వనస్థలిపురం డివిజన్ పనామా చౌరస్తాలో జాతీయ రహదారిపై విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న మట్టి బ్రిడ్జిని నిలిపివేయాలని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఆదివారం వనస్థలిపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత సర్కార్ హైదరాబాద్ ను  ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దితే.. అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. 

సిటీలో సుందరీకరించిన ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తే.. ఇక్కడ మాత్రం మట్టి బ్రిడ్జి నిర్మించి నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లర్లతో ఫ్లై ఓవర్ నిర్మిస్తే పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందుకు విరుద్ధంగా పూర్తిగా మట్టితో నింపివేసేలా నిర్మిస్తున్నారన్నారు. దీనిపై గత బీఆర్ఎస్ పాలనలో బీజేపీ నేతలు విమర్శలు చేశారని, ఇప్పుడు కేంద్రం చేపట్టే నిర్మాణమేనని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని సూచించారు. మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమలరెడ్డి, జీవీ సాగర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి పాల్గొన్నారు.