ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారమొస్తే మరొక బాట: సబితా ఇంద్రారెడ్డి

ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో 2024 మార్చి 6 బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. 

గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది.. ఇప్పుడ ఏం మాట్లాడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీతక్క ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టొద్దని కోర్టులో కేసు వేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరఫున తాము ఉండి పోరాటం చేస్తామని.. ఎవరు ఒక రూపాయి కూడా కట్టకూడదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అటు మున్సిపల్ కార్యాలయం ముందు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని నిరసన తెలుపుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేస్తామని వాగ్దానం చేసి మాట తప్పి ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. 

మరోవైపు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఫ్రీ ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.