ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలి .. బీఆర్ఎస్ నేతల డిమాండ్

ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలి .. బీఆర్ఎస్ నేతల డిమాండ్
  •  దేవన్నపేట పంపు హౌజ్ ను పరిశీలన 

హనుమకొండ / ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు కింద ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే దేవన్నపేట పంప్​హౌజ్​ను ప్రారంభించి, నీటిని విడుదల చేయాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు థర్డ్​ఫేజ్​లోని దేవన్నపేట పంప్​హౌజ్​ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి, బీఆర్ఎస్​నేతలు ఎర్రబెల్లి దయాకర్​రావు,  తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్​రెడ్డి, వినయ్​భాస్కర్, ఏనుగుల రాకేశ్​రెడ్డి వేర్వేరుగా సందర్శించారు. 

పంప్​హౌజ్ పనులు ఏడాదిన్నర కిందటే పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్​తో ప్రారంభించలేక పోయామని మాజీ మంత్రి దయాకర్​రావు తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రారంభించకపోవడంతో పంట పొలాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. దేవాదుల నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతోనే రూ.600 కోట్ల వరకు పంట నష్టం జరిగిందిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. 

పంప్​ హౌజ్​ వద్ద టెన్షన్ 

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు మేరకు బీఆర్ఎస్​నేతలు ముట్టడికి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద ఉదయం నుంచే బందోబస్తు కొనసాగించారు. ముందుగా మాజీ మంత్రి దయాకర్​రావు తదితర నేతలు రాగా పోలీసులు అడ్డుకున్నారు.  తాము ఆందోళన చేయమని  చెప్పడంతో  రెండు విడతల్లో పంప్​హౌజ్​సందర్శనకు అనుమతించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజేశ్వర్​ రెడ్డితో పాటు రాజయ్య ఇతర నేతలు సందర్శించారు. 

 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్​అడ్వైజర్ పెంటారెడ్డి, దేవాదుల ఎస్ఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడి.. వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. రాత్రికల్లా మోటార్లు ఆన్​చేసి ధర్మసాగర్​ రిజర్వాయర్​ లోకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు బదులిచ్చారు.  కాగా.. పంప్ హౌజ్​సందర్శన సందర్భంగా బీఆర్​ఎస్​ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, నేతలు రాజయ్య, అనంతరం ఎర్రబెల్లి తదితర నేతలు వేర్వేరుగా వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఐక్యతాలోపం కనిపించింది.