బీఆర్ఎస్​లోనే నామా .. పుకార్లకు చెక్​ పెట్టిన సిట్టింగ్ ఎంపీ 

  • బీజేపీ, కాంగ్రెస్​ లోకి వెళ్తారని మొన్నటి వరకు ప్రచారం 
  • ఎండిన పంటలను పరిశీలించిన గులాబీ నేతలు 
  • ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్​

ఖమ్మం, వెలుగు: ఖమ్మం లోక్​ సభ సభ్యుడు, బీఆర్ఎస్​ లోక్​ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుపై పుకార్లకు చెక్​ పడినట్లేనని తెలుస్తోంది.  బీఆర్ఎస్​ తరఫున వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ మారుతారంటూ దాదాపు మూడు వారాల నుంచి ప్రచారం జరిగింది. మొన్నటి వరకు ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఆయన కోసమే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించకుండా వెయిట్ చేయడంతో, నామా పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్టీ మార్పు గురించి నామా ఢిల్లీలో నర్మగర్భంగా మాట్లాడడంతో మార్పు తప్పదనే సంకేతాలు వచ్చాయి.

ఈలోగానే బీజేపీ తమ అభ్యర్థిని అనౌన్స్​ చేసింది. ఆ తర్వాత కూడా నామా కాంగ్రెస్​ లోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపించాయి. వరంగల్​లో కడియం పార్టీ మార్పు, మరికొంత మంది సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్​ అవుతున్న నేపథ్యంలో నామా కూడా అదే దారిలో ఉన్నారన్న టాక్​ వచ్చింది. బీఆర్ఎస్​ అభ్యర్థిగా ప్రకటించి దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఖమ్మంలో ఇంకా ప్రచారం మొదలుపెట్టకపోవడం కూడా ఈ సందేహాలకు తావిచ్చింది. కానీ ఆదివారం నామా నాగేశ్వరరావు ఖమ్మం రావడం, ఇతర బీఆర్ఎస్​ నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పాలేరు రిజర్వాయర్​ ను పరిశీలించడంతో ప్రచారాలకు తెరపడింది. ఇక ఆయన పార్టీ మారబోరని బీఆర్ఎస్​ కార్యకర్తల్లో ధీమా వచ్చింది. 

ఎండిన పంటలకు పరిహారమివ్వాలి

సాగు నీరందక పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్​ నేతలు డిమాండ్​ చేశారు. ఆదివారం కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించారు. పాలేరు రిజర్వాయర్​ ను సందర్శించిన తర్వాత ప్లకార్డ్స్​ తో ఆందోళన చేశారు. తర్వాత నేలకొండపల్లి మండలంలో సాగు నీరు అందక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్​ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్​ కమల్​రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మదన్​ లాల్, చంద్రావతి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు.

బాధిత రైతులతో మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్​ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్​ హయాంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా నాగార్జున సాగర్​ నుంచి జలాలు తీసుకువచ్చి పంటలను కాపాడామని, ఇప్పుడు మాత్రం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా రైతులకు నీళ్లివ్వకుండా పంటలు ఎండబెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో పాలన చేతకాక ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందేకాక, సాగు, తాగు నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడం విచారకరమన్నారు. పాలేరు జలాశయాన్ని తాగు, సాగునీరు కోసం వెంటనే సాగర్ జలాలతో నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పార్టీని వీడడం సరికాదు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు అందుకున్న నాయకులు, కష్టకాలంలో పార్టీని వీడివెళ్లడం సమంజసం కాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ హోదాలో ఉన్న కేశవరావు పార్టీని వీడివెళ్లడం తీవ్ర విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లోక్​ సభ లోపల, బయట అలుపెరగని పోరాటం చేసి, ప్రజల గొంతుకను వినిపించిన నామా నాగేశ్వరరావును నాయకులు, కార్యకర్తలు కష్టపడి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.