అచ్చంపేట, వెలుగు: కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్న గిరిజన రైతుకు చెందిన ఐదెకరాల పత్తి పంటను బీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేశారు. అచ్చంపేట మండలం ఐనూల్ గ్రామానికి చెందిన పత్లావత్ పత్యా, విజ్జీ గ్రామ సమీపంలో 334 సర్వే నెంబర్లో సుభాశ్రెడ్డికి చెందిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశారు. ఆదివారం రాత్రి సర్పంచ్ కొడుకు చంద్రు మరి కొందరితో కలిసి అరకలు కట్టి పంటను ధ్వంసం చేశాడని గిరిజన రైతులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉదయం సర్పంచ్ కొడుకును ప్రశ్నించేందుకు వెళ్లగా తమపై దాడి చేసి, అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.\
ALSO READ :భిక్షాటన చేసిన పంచాయతీ కార్మికులు
తహసీల్దార్, ఎస్ఐ పంటను ధ్వంసం చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపించారు. పంట వేయక ముందు అభ్యంతరం చెప్పకుండా ఇలా ధ్వంసం చేయడమేమిటని ప్రశ్నించారు. ధ్వంసం చేసిన పంటను డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు. పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తహసీల్దార్, సిద్దాపూర్ ఎస్ఐ గిరిజన రైతులను భయపెట్టడం సరైంది కాదన్నారు. అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజన రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు. రాజేందర్, రామనాథం, గోపాల్ రెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు.