పాలమూరు పై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు

 

  • 27 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే: మంత్రి ఉత్తమ్​

  • కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు

  • రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నరు

  • నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తం

  • రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం రూ.10,300 కోట్లు

  • కేంద్రానికి వరదనష్టంపై నివేదిక సమర్పించినం

  • విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి

  • సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ లో పర్యటన

సూర్యాపేట/కోదాడ/మేళ్లచెర్వు వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​పై బీఆర్ఎస్​పార్టీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వని ఘనత గత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందని విమర్శించారు. ఆదివారం ఉత్తమ్​కుమార్​రెడ్డి సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద ఎన్​ఎస్​పీ మేజర్ కెనాల్ కు గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వరద సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఫైర్​ అయ్యారు. 

వరదలు వచ్చినప్పుడు అత్యంత వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. నిర్ణీత గడువులోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని తెలిపారు. విడతలవారీగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. గత బీఆర్ఎస్​సర్కారు హయాంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

 దశాబ్దాలుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్​సాగర్ ప్రాజెక్టులను 10 ఏండ్లుగా పూర్తి చేయకుండా బీఆర్ఎస్​సర్కారు పెండింగ్​లో పెట్టిందని,  వాటిని కూడా 2025 డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే  తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని, అందరి సమక్షంలోనే ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన  కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోతే.. ఇతరులను బద్నాం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 

వరద నష్టాన్ని కేంద్రానికి నివేదించాం

భారీ వర్షాలతో ఏర్పడిన విపత్తుకు రాష్ట్రవ్యాప్తంగా రూ.10,300 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. నష్టం వివరాలను కేంద్రానికి నివేదించామని,  కేంద్ర సహాయం కోసం ఎదురుచూడకుండా యుద్ధ ప్రాతిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టామని చెప్పారు. విపత్తు సంభవించిన రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా అందరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 

భారీ నుంచి అతి భారీగా కురిసిన వర్షాలతో  ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్​నగర్​ ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించిందని చెప్పారు. కాగితం రామచంద్రాపురం వద్ద గండి పడిన సాగర్ ఎడమ కాలువను నెల రోజుల్లో పునరుద్ధరిస్తామని తెలిపారు. రేయింబవళ్లు పని చేసేందుకు ఏజెన్సీ ముందుకు వచ్చిందని,  ఇది అత్యయక పరిస్థితిగా గుర్తించినందుకే పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు.  వారంలోపు ఎన్​ఎస్​పీ కాలువలో నీళ్లు పారుతాయని, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పని చేస్తుందని తెలిపారు. 

రైతాంగం నష్టపోకూడదన్నదే  ప్రభుత్వ సంకల్పమని, పంటనష్టం జరగకూడదన్న భావనతోటే స్వయంగా పరిశీలన చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 773 చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని,  కొన్ని చోట్ల పంప్​హౌస్​లు  ముంపునకు గురయ్యాయని తెలిపారు. గండ్లు పడిన చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. హుజూర్​నగర్​ నియోజకవర్గ పరిధిలో బురుగ్గడ్డ నల్లచెరువు, చౌటపల్లి చెరువు, నాగులచెరువుతోపాటు కోదాడ నియోజకవర్గంలోని నారాయణపురం చెరువును పునరిద్ధరిస్తామని చెప్పారు. 

కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆర్లగూడెం గ్రామంలోని రెడ్లకుంట మేజర్, హుజూర్​నగర్​ నియోజకవర్గ పరిధిలోని  ముక్త్యాల బ్రాంచ్ మేజర్ కెనాల్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తామన్నారు. వరదలతో నష్టపోయిన పంటలకు తగిన పరిహారం అందిస్తామని, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. వరదల్లో ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. ఐదు లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నదని తెలిపారు.

 అనంతరం హుజూర్ నగర్ పట్టణంలో జరుగుతున్న ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఉత్తమ్​.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి అవసరమైన సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్, లైటింగ్ వంటి సౌకర్యాలపై అంచనాలు వేస్తే, మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.