
దుబ్బాక, వెలుగు : పార్టీ బాలోపేతానికి కృషి చేసినోళ్లను పట్టించుకోని ఎంపీ మాకొద్దు అని, అందుకే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నామని దుబ్బాక నియోజకవర్గానికి చెందిన పలువురు లీడర్లు తెలిపారు. తొగుట మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు, చంద్లాపూర్ సర్పంచ్ బొడ్డు నర్సింలుతో పాటు మిరుదొడ్డి, రాయపోల్ మండలాలకు చెందిన వంద మంది బీఆర్ఎస్ నాయకులు బుధవారం దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు ఆపదలో ఉంటే పరామర్శకు రాని ఎంపీ తమకొద్దని, కనీసం సర్పంచ్‌లు, ఎంపీటీసీల పేర్లను గుర్తు పెట్టుకోరని, గ్రామాల అభివృద్ధి పనుల కోసం పోతే కూడా పట్టించుకోరని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామాకాల కోసం పోరాటం చేసినోళ్లకు గొర్రెలు, చేపలు పంపిణీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.
రఘన్నతోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందన్న నమ్మకంతోనే బీజేపీలో చేరుతున్నామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సత్తయ్య, బ్యాంక్ ఉద్యోగి కొంగరి అంజయ్య ఉన్నారు.