వెలుగు, నెట్వర్క్: బీఆర్ఎస్లో క్యాడర్‌పై లీడర్లకు పట్టు తప్పింది. హైకమాండ్ ఆదేశాలను లీడర్లు, లీడర్ల ఆదేశాలను క్యాడర్ బేఖాతరు చేస్తున్న పరిస్థితి! ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ హైకమాండ్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంతో రాష్ట్రంలోని గులాబీ క్యాడర్ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది. ఇక మున్సిపాలిటీల అవిశ్వాసాల విషయంలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిల్చో మంటే నిల్చొని, కూర్చోమంటే కూర్చున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, తదితర ‘లోకల్’ ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు ‘డోంట్‌కేర్’ అంటున్నారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేల మాటను లెక్కచేయకుండా క్యాంపులకు వెళ్లడమే కాదు, కారు దిగి కాంగ్రెస్కండువాలు కప్పుకుంటున్నారు.
సాక్ష్యాత్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఇలాకా సిరిసిల్లలో 12 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అక్కడి చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు ఏకంగా మాజీ మంత్రి మీటింగ్‌కే డుమ్మా కొట్టి వెళ్లిపోయారు. కేటీఆర్ గంభీరమైన ఉపన్యాసాలు విని కూడా మరుసటి రోజు గంభీరావుపేట మండలానికి చెందిన పదులసంఖ్యలో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనైతే కారు దాదాపు ఖాళీ అయింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 96 మంది సర్పంచ్‌లు, 25 మంది ఎంపీటీసీలు, నలుగురు జడ్పీటీసీలు, 25 మంది కౌన్సిలర్లు , ముగ్గురు ఎంపీపీలు కాంగ్రెస్‌లో చేరారు. ఇలా పార్లమెంట్ఎన్నికల ముందు చేజారుతున్న క్యాడర్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక హైకమాండ్ తలపట్టుకుంటోంది.
హస్తగతమవుతున్న మున్సిపాలిటీలు..
అసెంబ్లీ ఎన్నికల ముందు మున్సిపల్చైర్మన్ల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినా కౌన్సిల్మీటింగులు జరగకుండా అప్పటి బీఆర్ఎస్ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. తీర్మానాలు వెనక్కి తీసుకోకపోతే పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఎక్కడా అవిశ్వాస తీర్మానాలు సమావేశాల దాకా వెళ్లలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలవగానే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఆ పార్టీ కౌన్సిలర్లు మళ్లీ అవిశ్వాస తీర్మానాల దుమ్ముదులిపి బీఆర్ఎస్ చైర్పర్సన్లను దింపుతున్నారు. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో కారు దిగి, కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దింపారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో మున్సిపాలిటీ ఆ పార్టీ ఖాతాలో పడింది. జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలోనూ అవిశ్వాసం ప్రతిపాదించగా.. కోర్ట్ స్టేతో పాలకవర్గం కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్‌ను దింపిన కౌన్సిలర్లు కాంగ్రెస్ జెండా ఎగరేశారు. సిరిసిల్ల బల్దియాలో 12 మంది బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమై క్యాంప్ నకు వెళ్లారు. జనగామలో 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయినా.. 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నలుగురు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. కామారెడ్డి మున్సిపాల్టీకి చెందిన కౌన్సిలర్లు విడతల వారీగా ఇప్పటి వరకు 12 మంది కాంగ్రెస్ లో చేరారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆరు గురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు హస్తం గూటికి చేరడం తో భూపాలపల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్మున్సిపాలిటీ హస్తగతమైంది. ఇలా ఒక్కో మున్సిపాలిటీ హస్తగతమవుతున్నా బీఆర్ఎస్ లీడర్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మండల, జిల్లా పరిషత్లలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిషత్సైతం కాంగ్రెస్ ఖాతాలో పడడం గమనార్హం.
చేరికలే చేరికలు..
బీఆర్ఎస్ లీడర్లు ఎంత ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌లోకి వలసలు ఆగడం లేదు. తాజాగా రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ జడ్పీటీసీ , 8మంది సర్పంచులు ఇటీవల రాజీనామా చేసి వందమందితో కాంగ్రెస్ లో చేరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్‌తో పాటు నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి .. మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్ తోపాటు మరో కౌన్సిలర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. మెట్ పల్లిలో ఐదుగురు బీఆర్ఎస్కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టి చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బుధవారంగాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీణవంక మండలం మల్లారెడ్డి పల్లి సర్పంచ్ ఎం.ఎల్లారెడ్డి, . లస్మక్కపల్లి సర్పంచ్ దాసరపు సుజాత లక్ష్మణ్ తోపాటు 500 మంది బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ , వైస్‌చైర్మన్ సాగర్రెడ్డితో పాటు మరో ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
రివ్యూల్లో లీడర్లపై విమర్శలు..
బీఆర్ఎస్ ఓటమి నుంచి ఇంకా తేరుకోని చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బయటకు రావడం లేదు. కొందరు హైదరాబాద్‌లోనే మకాంవేసి నియోజకవర్గాలవైపు కన్నెత్తిచూడడం లేదు. ఇక అడపాదడపా బయటకు వస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు లోకల్ లీడర్ల నుంచి విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇటీవల గద్వాలలో రివ్యూ మీటింగ్‌కు వెళ్లిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అక్కడి లోకల్ బీఆర్ఎస్ లీడర్లు ఓ ఆట ఆడుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల బతుకులను చెప్రాసీల కన్నా అధ్వానంగా మార్చారని గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్కేశవ్ ఆరోపించారు. ‘ మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి ఏనాడూ తమ దిక్కు చూడలేదని, తమ ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదని గట్టు ఎంపీపీ విజయ్ కుమార్ శ్రీనివాస్‌గౌడ్ ముఖం మీదే తిట్టిపంపించారు. బీఆర్ఎస్లో ఆత్మీయత లేదు. తాజాగా యాదాద్రి రివ్యూ మీటింగ్‌లో పలువురు నేతలు, ‘నిజాలు చెప్తే మీకు ఎక్కలేదు.. మీరు ఉద్యమకారులను పట్టించుకోలేదు..కార్యకర్తలను ఏడ్పించారు.. అందుకే ఫలితం ఇలా ఉంది..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేసి మాట్లాడిన తీరు, బీఆర్ఎస్ క్యాడర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అద్దం పడ్తోంది.