
- ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌దే: కేటీఆర్
- మట్టికూలుతున్నదని గుర్తించినా చర్యలు తీసుకోరా?: హరీశ్ రావు
- పనులు మొదలుపెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగింది?: కవిత
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ ప్రమాదంపై నేష నల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)తో దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. శనివారం ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే హరీశ్ రావు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ అన్నారు.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి న ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒక బ్యారేజీలోని పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు.. వారి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రమాదాలపై ఏమంటారని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించి, కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ చేతగానితనమే: హరీశ్‌రావు
కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థ, చేతగాని పాలనకు నిదర్శనమని హరీశ్ రావు అన్నా రు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని ఎద్దేవా చేశారు. దీనిపై ఎన్డీఎస్ఏతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా మట్టి కూలుతున్నదని గుర్తించినా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావాల ని కోరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ఎన్డీఎస్ఏ స్పందించాలని కవిత అన్నారు. పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 10 కిలో మీటర్ల మేర టన్నెల్ తవ్వినా.. ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 రోజుల కిందటే పనులు పెట్టినా.. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దానికి బాధ్యులెవరో ఎన్డీఎస్ఏ తేల్చాలని కోరారు.