బీఆర్​ఎస్​ భూబాగోతం..!ఓరుగల్లులో ఆఫీస్‍ పేరిట రూ.60 కోట్ల భూకబ్జా

  •     హనుమకొండ సిటీలో అగ్వకే కొన్న ఎకరం స్థలం
  •     కేటాయింపు ఒకచోట, అదే సర్వే నెంబర్​తో మరోచోట పార్క్​స్థలం కబ్జా      
  •     బయటపడుతున్న గులాబీ లీడర్ల ఉదంతాలు

వరంగల్, వెలుగు : గ్రేటర్‍ వరంగల్లో బీఆర్​ఎస్​ లీడర్లు ఆఫీస్‍ నిర్మాణం పేరుతో ఏకంగా రూ.60 కోట్ల విలువైన భూ కబ్జా చేశారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‍ కోసం భూములను కేటాయించుకున్నారు. ఇదే పెద్ద తప్పు కాగా, ఆఫీస్‍ కోసం అధికారులు కేటాయించిన భూమి ఒకచోట ఉండగా, దానిని వదిలేసి అదే సర్వే నంబర్‍ లో ఉన్న బాలసముద్రంలోని పార్క్​స్థలాన్ని కబ్జా చేశారు. పనిలోపనిగా పక్కనే ఉన్న మరో 8 గుంటల భూమిని కూడా కలిపేసుకున్నారు. మున్సిపల్‍ పార్క్​స్థలాన్ని ఎవరికీ ఇవ్వొద్దనే నిబంధన ఉన్నా, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. ఆ స్థలానికి ఇంటి నంబర్‍ లేకున్నా,  కిందిస్థాయి ఆఫీసర్లు కరెంట్‍ కనెక్షన్ ఇచ్చారు. 

రూ.60 కోట్ల స్థలాన్ని గజం రూ.100కు ఇచ్చిన్రు..

కేసీఆర్‍ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏవిధంగా భూకబ్జాలకు పాల్పడ్డారో ఇట్టే తెలిసిపోతుంది. గ్రేటర్‍లో వరంగల్‍ ప్రాంతం వ్యాపార కేంద్రంగా ఉండగా, హనుమకొండ ప్రాంతం గవర్నమెంట్ ఆఫీసులు, కార్పొరేట్‍ సంస్థలు, బ్రాండేడ్‍ షోరూంలు, కమర్షియల్​బిల్డింగులు ఉన్నాయి. అందులోనూ హనుమకొండ బస్టాండ్‍కు దగ్గరుగా బాలసముద్రం ట్రైసిటీ సెంటర్‍ పాయింట్‍గా ఉంటుంది. ఈ ఏరియాలో గజం స్థలం మార్కెట్‍ విలువ సుమారు రూ.లక్ష పైనే పలుకుతోంది. కాగా, అప్పటి బీఆర్ఎస్‍ ప్రజాప్రతినిధులు పార్టీకి ఎకరం స్థలం కావాలంటూ అధికారులకు లెటర్‍ పెట్టారు. బీఆర్ఎస్‍ నేతలకు కొమ్ముకాస్తున్న ఆఫీసర్లు, అడగడమే ఆలస్యం గజానికి రూ.100 చొప్పున ఎకరం స్థలం కేటాయించారు.  

పార్కు స్థలం కబ్జా.. 

''గుడిని గుడిలోని లింగాన్ని మింగిన” చందంగా బీఆర్ఎస్‍ నేతలు పార్టీ ఆఫీస్‍ పేరుతో కోట్లాది విలువ చేసే భూములను ఇష్టారీతిన రాసుకోగా, తమది కాని భూములను కబ్జా చేశారు. బాలసముద్రం ఏరియాలో అప్పట్లో 1066 సర్వే నంబర్‍తో దాదాపు 200 ఎకరాలు ఉండేవి. బీఆర్ఎస్‍ లీడర్లు ఆఫీస్‍ కోసం ప్రస్తుత ఏషియన్‍ మాల్, గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍క్లబ్‍ వెనుక భాగంలో ఎకరం స్థలం కేటాయించారు. అయితే, బీఆర్ఎస్‍ లీడర్లు మాత్రం ఆ భూమిని వదిలేసి ప్రస్తుత వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​ను ఆనుకుని ఉన్న మున్సిపాలిటీకి చెందిన ఎకరం స్థలాన్ని అదే సర్వే నంబర్తో కబ్జా పెట్టారు. నాడు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్‍కు చెందిన దాస్యం వినయ్‍ భాస్కర్‍ ఉండటంతో ఆయన క్యాంప్ ఆఫీస్​ను ఆనుకుని పార్టీ ఆఫీస్‍ నిర్మించారు.

ఎమ్మెల్యే ఫిర్యాదుతో నోటీసులు 

వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్‍ భాస్కర్‍ స్థానంలో నాయిని రాజేందర్‍రెడ్డి రావడంతో అక్రమ ఆఫీస్‍ నిర్మాణం విచారణపై అడుగులు పడ్డాయి. మూడు నెలల క్రితం బీఆర్‍ఎస్‍ హనుమకొండ ఆఫీస్‍ నిర్మాణం అక్రమం, నిబంధనలకు విరుద్ధంగా పార్క్​ స్థలాన్ని కబ్జా చేశారంటూ నాయిని ఆర్డీవోతో పాటు కలెక్టర్‍కు ఫిర్యాదు చేశారు. దీనికితోడు బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍కు స్థలం కేటాయిస్తూ ఇచ్చిన పర్మిషన్‍ పేపర్లు ఇవ్వాలంటూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీంతో కలెక్టర్‍ ఆదేశానుసారం గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ అధికారులు కదిలారు.

తెలంగాణ మున్సిపాలిటీల చట్టం_2019 లోని సెక్షన్‍ 254 ప్రకారం బీఆర్‍ఎస్‍కు కాజీపేట సర్కిల్‍_2 నుంచి నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని 1066 సర్వే నంబర్‍లో బీఆర్‍ఎస్‍ పార్టీకి స్థలం కేటాయిస్తూ ఇచ్చిన అధికారులు ఇచ్చిన పర్మిషన్‍ పత్రాలు, భవన నిర్మాణ అనుమతి కాపీలు అందించాలని ఈ నెల 25న నోటీసులు అందించారు. వెరిఫికేషన్‍ కోసం నోటీసులు అందిన 3 రోజుల్లోగా పర్మిషన్‍ కాపీలన్నీ సమర్చించాలని అధికారులు అందులో వెల్లడించారు. హనుమకొండ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ప్రభుత్వ చీఫ్‍ విప్‍, మాజీ ఎమ్మెల్యే ఉండటంతో ఆయన పేరుతోనే నోటీసులు పంపించారు. అధికారులు పంపిన నోటీసులకు బీఆర్‍ఎస్‍ నేతల స్పందన ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అందులో పేర్కొన్నారు.

అనుమతులు లేకుంటే కూల్చేయాలే..

బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍ స్థలానికి ఎటువంటి పర్మిషన్లు లేవని, అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్‍ భాస్కర్‍ ఆఫీస్‍ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పార్క్​ స్థలం భూకబ్జా చేశాడని గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పడు ల్యాండ్‍ కేటాయింపు, బిల్డింగ్‍ పర్మిషన్‍ డిటైల్స్​కావాలంటూ ఓ సిటిజన్‍గా ఆర్టీఐ కింద కలెక్టర్‍ను అడిగాను. ఈ క్రమంలో అధికారులు స్పందించి పార్టీ ఆఫీస్‍ బాధ్యులకు నోటీసులు పంపించారు. ల్యాండ్‍ కేటాయింపు, బిల్డింగ్‍ పర్మిషన్‍ ఉన్నాయో లేదో చూసి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‍ను కోరాను. పర్మిషన్లు లేకుంటే ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేయాలే. 

- నాయిని రాజేందర్‍రెడ్డి (వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే)

మరో 8 గుంటలు కలుపుకొన్నారు..

వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్‍ రెండూ కలిసి ఉండటంతో ఏ భూమి దేనిదో ఎవ్వరికీ అర్థం కాదు. కాగా, ఆఫీస్‍ పేరుతో ఎకరం పార్క్​ స్థలాన్ని కబ్జా చేసిన గులాబీ లీడర్లు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‍ ప్రభుత్వం ఓటమి చెందాక కూడా ఎవరికీ డౌట్‍ రాకుండా మరో 8 గుంటలు కబ్జా పెట్టారు. వినయ్‍ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్యాంప్ ఆఫీస్‍ స్థలంగా ఆఫీస్‍ వెనకాల కూరగాయలు, పూలతోటకు వాడుకునేవారు. అయితే బీఆర్ఎస్‍ పార్టీతో పాటు వినయ్ భాస్కర్‍ సైతం ఓటమి చెందడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‍ ఖాళీ చేయాల్సి వస్తుందని భావించిన గులాబీ పెద్దలు

 క్యాంప్​ఆఫీస్‍ వెనకాల స్థలాన్ని పార్టీ ఆఫీస్​లోకి కలుపుకొన్నారు. ఇదంతా సంబంధిత శాఖల అధికారులకు తెలిసినా, మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేసే ఆఫీసర్లు పట్టించుకోలేదు. మొత్తంగా సుమారు రూ.60 కోట్లు విలువ చేసే ఎకరం 8 గుంటల కమర్షియల్‍ స్థలాన్ని గ్రేటర్‍ వరంగల్‍ బీఆర్‍ఎస్‍ లీడర్లు భాజప్తా కబ్జా పెట్టారు.