వనపర్తి, వెలుగు : సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పదవులు పోయి 10 నెలలు కాకముందే కారు కూతలు కూసే నాయకులు ముందుగా ఆసుపత్రుల్లో చేరి మంచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నియోజకవర్గంలోని 592 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం ఖాయమని, ప్రజావేదికలపై ప్రసంగాలు చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావన్నారు. రుణమాఫీ చేస్తామని పదేండ్లు కాలయాపన చేసి రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులదేనన్నారు.
అన్ని వనరులు ఉన్న రాష్ట్రాన్ని రూ.7.12 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీటింగుల్లో రైతులతో చేతులెత్తించడం కాదని, దమ్ముంటే రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. శ్రీనివాస్‌గౌడ్, కిచ్చారెడ్డి, శంకర్‌ప్రసాద్, మహేశ్, బ్రహ్మచారి పాల్గొన్నారు.