- ఖాళీగా పలు మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు
- కొన్ని మున్సిపాలిటీల్లో కోఆప్షన్ మెంబర్స్ ను నియమించని సర్కార్
- నామినేటెడ్ పోస్టులపై బీఆర్ఎస్ క్యాడర్ ఆశలు
- ఉద్యమకారులకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన
కరీంనగర్, వెలుగు: ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం కష్టపడిన తమకు ఈ రోజు కాకపోతే రేపు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశించిన బీఆర్ఎస్ క్యాడర్ లో నిరాశ ఆవరిస్తోంది. మరో ఏడు నెలల్లో ఎన్నికలు ఉండడం, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాక ఆ పార్టీ సీనియర్లు తమ లీడర్లను నిలదీస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తమకు న్యాయం చేస్తారని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు పని చేస్తున్నామని, ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలని అడుగుతున్నారు. పార్టీ క్యాడర్ లో ఐక్యత కోసం బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనాలే ఇందుకు వేదికవుతున్నాయి. ఇది టీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారింది.
ఆత్మీయ సమ్మేళనంలో నిరసన స్వరం..
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమపార్టీ గా ఉన్న టీఆర్ఎస్ ను నమ్ముకుని పని చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా చాలా మంది ఉద్యమకారులకు అవకాశాలు దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి చేరిన అనేక మందికి సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీ పదవుల వరకు దక్కాయి. దీంతో పార్టీ అధిష్టానం, లీడర్లపై నమ్మకంతో ఏళ్ల తరబడి పదవుల కోసం ఎదురుచూసిన ఉద్యమకారులు ఇప్పుడు నిరసన స్వరం వినిపిస్తున్నారు. చాలా ఏళ్లు ఓపిక పట్టిన కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 21న కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలో ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న పలువురు కార్యకర్తలు, లీడర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తారు. తమకు సమ్మేళనంలో మాట్లాడే అవకాశమివ్వాలని పట్టుబట్టారు. తమ పదవుల సంగతేంటని ప్రశ్నించారు. మధ్యలో వచ్చిన వాళ్లకు పదవులు వచ్చాయని, మొదటి నుంచి పని చేస్తున్నవాళ్లకు పదవులు రాలేదని మండిపడడం వారి ఆవేదనకు అద్దంపట్టింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు వారిని పోలీసులతో బయటికి గెంటేయించారు. పదవుల సంగతి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చూసుకుంటారని మంత్రి గంగుల చెప్పినప్పటికీ.. క్యాడర్ లో ఆగ్రహం చల్లారలేదు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లోనూ ఇలాగే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలప్పుడు ఇంటింటికీ తిరిగి ప్రజలతో ఓట్లేయించిన ద్వితీయ శ్రేణి క్యాడర్ కు ఇప్పుడు కోపం వస్తే రేపు ఎన్నికల్లో ఎలా అని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.
పదవులపైనే క్యాడర్ ఆశలు..
హుజురాబాద్ నియోజకర్గంలోని కమలాపూర్, జమ్మికుంట, అలాగే మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి కాలం ముగిసినప్పటికీ ఇప్పటివరకు కొత్త కమిటీలను వేయలేదు. వీటిని భర్తీ చేస్తే సుమారు 50 మంది నేతలకు పదవులు లభించే అవకాశముంది. అలాగే ప్రజాప్రతినిధులుగా పదవులు ఉన్న కొందరికి పార్టీ పదవులు అప్పగించారు. జోడు పదవులపై క్యాడర్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాలకవర్గం పదవీ కాలం ముగియడానికి వచ్చినా ఇంతవరకు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్స్ ను నియమించలేదు. భద్రాచలం తర్వాత ప్రతి ఏటా అత్యంత వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగే ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానానికి గత రెండేళ్లుగా కమిటీ ఖరారు చేయడం లేదు. అంతకుముందు ఆలయ కమిటీని నియమించినప్పటికీ రెండేళ్లు కరోనా కారణంగా కమిటీ ఉనికిలోకి రాకుండానే పదవి కాలం ముగిసింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలయ కమిటీ చైర్మన్ కోసం పోటీ పెరగడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ నెల 30న జరిగే శ్రీరామ నవమినాటికైనా కమిటీని నియంచకపోతారా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అలాగే జమ్మికుంట దుబ్బ మల్లికార్జున స్వామి టెంపుల్ కమిటీలను నియమించలేదు.