తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది : అజ్మీరా కిషన్ నాయక్ 

తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది : అజ్మీరా కిషన్ నాయక్ 
  • బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్ 

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికి కోల్పోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్ తండా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధీరావత్ శ్రీనునాయక్, బీఆర్ఎస్ మండల నాయకుడు ధీరావత్ మనోజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తనకు తిరుగులేదనే అహంకారంతో విర్రవీగిన కేసీఆర్ కు ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని గుర్తుచేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఎంతటివారినైనా అధఃపాతాళానికి తొక్కుతామని తెలంగాణ ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాతాళానికి పడిపోయిందని, ఎన్ని జాకీలు పెట్టినా పైకి లేచే అవకాశమే లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, మండల అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.