వనపర్తి/నాగర్‌కర్నూల్, వెలుగు: పెద్ద సంఖ్యలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీ వంచన చేరడంతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన ప్రారంభమైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతోంది. వీరితో పాటు మరికొందరు పార్టీ మారతారనే టాక్ వినిపిస్తుండగా, పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో బడా నేతలు, మండలాలు, గ్రామాల్లో పేరున్న నాయకులు పార్టీని వీడడం బీఆర్ఎస్ కు షాక్ ఇస్తోంది.
మంత్రిపై అసంతృప్తితో..
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ పార్టీతో విభేదించి మంత్రి నిరంజన్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీని వీడిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా వీరు బీఆర్ఎస్ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డితో విభేదించిన ఇద్దరు ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వీడిన జడ్పీ చైర్మన్ తిరిగి బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఇద్దరు ఎంపీపీలు మాత్రం జూపల్లితో కలిసి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వనపర్తికి ఆహ్వానించి అసంతృప్త నేతలతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు.
ఈ సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన వ్యక్తమైంది. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి సమక్షంలో అసంతృప్త నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చింది. యువ నాయకుడిగా యాక్టివ్ ఎంపీపీగా పేరున్న మేఘారెడ్డి క్లాస్–1 కాంట్రాక్టర్ గా అందరికీ సుపరిచితం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానంటూ మాజీ మంత్రి చిన్నారెడ్డికి భరోసా ఇచ్చారు. జూపల్లి చేరికతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
ఆ తరువాత మరో సారి మంత్రి అయ్యారు. రెండోసారి ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఓడిపోయిన జూపల్లికి అధికార పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఇటీవల తిరుగుబాటు చేశారు. కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ ఓటమి కోసం పని చేస్తానని శపథం చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నేతలందరినీ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తుండడంతో వనపర్తిలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
నాగర్ కర్నూల్ నుంచి..
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో విభేదించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తన కొడుకు డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. అలాగే నాగర్ కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెల్కపల్లి మండలాల నుంచి ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సన్నిహితంగా ఉండే ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నారు.
కాంగ్రెస్‌లోకి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్..
కల్వకుర్తిలో ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి తక్కువ టైంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సోమవారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టిన రాఘవేందర్‌రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్‌గా ఎక్స్పోజ్ అయ్యారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి లాభమేనని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ALSOREAD:హోటల్ బిజినెస్‌లో నష్టాలు.. హెచ్ఏఎల్ ఎంప్లాయ్ సూసైడ్
ఎన్నో అవమానాలు భరించా..
2018లో మర్రి జనార్దన్ రెడ్డి గెలుపు కోసం పని చేశాను. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో సార్లు అవమానించారు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తెస్తే ఈ పంచాయితీలు అక్కడే చూసుకోండని సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీగా కొడుకు పేరు ప్రతిపాదించాను. రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పాను. ఈ రెండు జరగకుండా మర్రి జనార్దన్ రెడ్డి రాజకీయం చేసిండు. ఈ సారి ఎలక్షన్స్‌లో మర్రి జనార్దన్ రెడ్డి ఎట్ల గెలుస్తాడో చూస్తాను. కాంగ్రెస్‌లో స్వేచ్చగా పనిచేస్తాం.
– ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి