గోదావరిఖని, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో లీడర్లు పార్టీలు మారుతున్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్‌ఎస్ రామగుండం సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను గెలిపిస్తే తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని, పదవులు ఇస్తామని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మి ఎల్లయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 15వ డివిజన్ కార్పొరేటర్ బదావత్ శంకర్ నాయక్, 21వ డివిజన్ కార్పొరేటర్ ఫాతిమా సలీంబేగ్ కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఎల్కలపల్లి సర్పంచ్ చిట్టబోయిన స్వరూప రాజ్‌కుమార్, ఉప సర్పంచ్ మేకల రాజకొమురయ్య, ఎంపీటీసీ పాలడుగుల సతీశ్, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు కాగా కాంగ్రెస్ కు చెందిన యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు వాజిద్ ఖాన్ బీఆర్‌ఎస్‌లో చేరగా.. ఇటీవల కాంగ్రెస్‌కు కార్పొరేటర్ గాదం విజయానంద్, బీజేపీ కార్పొరేటర్ దుబాసి లలితమల్లేశ్, మందల కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ లో చేరారు.