బీజేపోళ్లను దేవుడు కూడా క్షమించడు : ఎమ్మెల్యే ఐలయ్య

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకుంటున్న బీజేపీ నాయకులను ఆ దేవుడు కూడా క్షమించడని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి, గుండాల మండలం పాచిల్ల, రాజాపేట మండలం చల్లూరు, రేణికుంట గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

పార్టీలో చేరినవారికి ఐలయ్య కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని ఎన్నికల్లో పాతాళానికి తొక్కాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 దేశప్రజల మధ్య రిజర్వేషన్ల పేరుతో బీజేపీ మతచిచ్చు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే తమకు ప్రత్యేక దైవం అని

వారి అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఎంపీపీ చీర శ్రీశైలం,  కాంగ్రెస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, రాజాపేట మండల అధ్యక్షుడు నమిలె మహేందర్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.