హుజూర్ నగర్, వెలుగు : గొర్రెల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో గొర్రెలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హుజూర్ నగర్ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం హుజూర్ నగర్ మాజీ సర్పంచ్ గొట్టే రామయ్య యాదవ్ , నేరేడుచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ చలసాని శ్రీనివాస రావు, పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. గొర్రెలు కోసం డీడీలు కట్టి ఎనిమిది నెలలైనా బీఆర్‌ఎస్ సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో దాదాపు 20 లక్షల యాదవ కుటుంబాలు ఉన్నాయని వారి అభివృద్ధికి కార్పొరేషన్ ద్వారా సహకరిస్తామని మాటిచ్చారు. నియోజకవర్గంలో లైమ్ స్టోన్ గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడంతో మేళ్లచెర్వు ,- దామరచెర్ల రైల్వే లైన్ కెపాసిటీ పెంచేందుకు, ప్యాసెంజర్ రైళ్లు నడిపేందుకు పార్లమెంట్‌కు ప్రతిపాదనలు పంపానని చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మరింత అభివృద్ధి చేయడంతో పాటు పీజీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రామస్వామి గుట్ట వద్ద గల హౌసింగ్ కాలనీలోని ఇండ్లను పూర్తిచేసి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. నేతలు సుబ్బారావు , వెంకటేశ్వర్లు, నాగన్న గౌడ్, ముడెం గోపిరెడ్డి, దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కందుల సురేశ్ చౌదరి, బాచిమంచి గిరిబాబు పాల్గొన్నారు.