శ్రీనివాస్​రెడ్డి గూటికి చేరుతున్న బీఆర్ఎస్​ లీడర్లు

  • కొత్తగూడెంలో భారీ సమ్మేళనానికి ప్లాన్​
  • నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్​ ఆఫీస్​ల ఏర్పాటుపై దృష్టి

భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో తన వర్గాన్ని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్​ ఆఫీస్​లను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు నియోజకవర్గ కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలోని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. జిల్లాలోని పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీరును వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు చండ్రుగొండ మండలంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చానీయాంశంగా మారింది. 

ఎమ్మెల్యేలపై తిరుగుబాటు..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో నియోజకవర్గ కేంద్రాల్లో బల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారడం ఖాయం కాగా, బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలను తన వైపు తిప్పుకొనేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇల్లందులో జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన రోజే ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ ఆధ్వర్యంలో పోటీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కనకయ్య నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు హాజరయ్యారు. ఎమ్మెల్యే తీరును వ్యతిరేకించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ అదే పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు తీరుపై నిప్పులు చెరిగారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్​కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు చండ్రుగొండ మండలంలో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండలాల్లో పర్యటించే సమయంలో ప్రోటోకాల్​ పాటించడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలపై స్పందించడం లేదని, పొంగులేటికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన సగం మంది కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే  పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పొంగులేటి గూటికి చేరుతుండడం గమనార్హం. పొంగులేటి ఏ పార్టీలో చేరినా ఆయన వెంటే ఉంటామని చెబుతుండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఆయన అనుచరులు ప్లాన్​ 

పెరుగుతున్న అనుచరులు..

ఖమ్మం: జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల సంఖ్యను పెంచుకోవడంపై నజర్​ పెట్టారు. వైరా నుంచి గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన విజయబాయి రీసెంట్​గా ఆ పార్టీకి రిజైన్​ చేసి పొంగులేటి వెంట నడుస్తానని ప్రకటించారు.2014లో  వైరాలో వైసీపీ తరపున మదన్ లాల్ ను,  2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాముల నాయక్ ను పొంగులేటి  గెలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ పొంగులేటికి హ్యాండ్  ఇచ్చి బీఆర్ఎస్ లో కొనసాగుతుండగా, విజయాబాయి మాత్రం పొంగులేటి వర్గం లో చేరారు. మరోవైపు మధిర నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాన్ని సోమవారం బోనకల్ లో ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ తరలిరావాలని అనుచరులకు ఇప్పటికే పొంగులేటి సమాచారం పంపారు. వచ్చే నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.