బీజేపీ టికెట్​ కోసం.. బీఆర్ఎస్ కు గుడ్​ బై చెప్తున్న లీడర్లు

  • మెదక్​ జిల్లాలో సెకండ్​ క్యాడర్​ లీడర్ల తీరు 
  • బీఆర్​ఎస్​నుంచి బీజేపీకి క్యూ

మెదక్, వెలుగు : మెదక్ ​జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీని సెకండ్​ క్యాడర్ ​ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ‘కమలం’ టికెట్​ కోసం ‘గులాబీ’కి గుడ్​బై చెబుతున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినా, పార్టీ కోసం ఎంతగానో కష్టపడినా సరైన ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదని బీఆర్​ఎస్​ను వీడుతున్న బీసీ లీడర్లు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఆ పార్టీ  లీడర్లు, ఎమ్మెల్యేల నుంచి అభివృద్ధి పనుల విషయంలో సరైన సహకారం లభించకపోగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎంకరేజ్​ చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు. 

కారు దిగింది వీళ్లే.. 

అధికార పార్టీకి చెందిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ  మాజీ అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గత ఏడాది ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ లో వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులకు సరైన ప్రాధాన్యత లేదంటూ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే ధ్వజమెత్తడంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన వెంటనే తన సహచర కౌన్సిలర్లతో కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ ఆయనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవి ఇచ్చింది. కాగా నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేశారు. 

ALSO READ: బిహార్ నుంచి హైదరాబాద్ కు.. గంజాయి చాక్లెట్లు

మెదక్ నియోజకవర్గంలోని నిజాంపేట మండల జడ్పీటీసీ మెంబర్ పంజా విజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అభివృద్ధికి సహకరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేశారు. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ఎన్ఆర్ఐగా ఉన్న తాను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తుండగా  రాజకీయాల్లోకి రావాలని ఎంకరేజ్​ చేసిన వారే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన విజయ్ కుమార్ బీజేపీలో జాయిన్ అయి రానున్న ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు  చేసుకున్నారు. 

అసిస్టెంట్ కేన్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన  ఉద్యమంలో పాల్గొని, 2007 లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన చేగుంటకు చెందిన తీగల  భూమ్ లింగం గౌడ్ తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. విద్యార్ధి దశలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన ఆయన త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. కొన్నాళ్ల కిందట ఆయన మెదక్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే వివిధ సమీకరణాల నేపథ్యంలో  ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. కాగా వచ్చే  లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఆ పార్టీ పెద్దల నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించినట్టు తెలిసింది. ఈ మేరకు బుధవారం భూమ్ లింగం గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకొనున్నారు. 

గతంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి, చిలప్​చెడ్​ జడ్పీటీసీ మెంబర్ పదవికి  రిజైన్ చేసిన చిలుముల శేషసాయిరెడ్డి సైతం అప్పట్లో  బీజేపీ ముఖ్య నాయకులను కలిశారు. త్వరలో ఆయన పార్టీలో చేరనున్నట్లు చర్చ నడుస్తోంది.