ఆరూరి కోసం హైడ్రామా ..బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యేను లాక్కెళ్లిన బీఆర్ఎస్​ నేతలు

  • మీడియా సాక్షిగావాహనాల్లో హైదరాబాద్​కు
  • దండం పెట్టి.. కన్నీరు కార్చినా కనికరించని మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ  సారయ్య
  • మార్గమధ్యలో జనగామ శివారు పెంబర్తి వద్ద వాహనాలను అడ్డుకున్న  బీజేపీ లీడర్లు
  • కిందికి దింపే క్రమంలో చిరిగిన ఆరూరి షర్ట్​ 

వరంగల్‍/జనగామ, వెలుగు: బీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను హనుమకొండలోని ఆయన నివాసం నుంచి బీఆర్ఎస్​ నేతలు ఎత్తుకెళ్లారు. మార్గమధ్యలో బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘తలమాసినోళ్లు  పోతే పార్టీకి ఏం కాదు’ అని కేసీఆర్​ కరీంనగర్​లో చెప్పి 24 గంటలు గడవకముందే పార్టీ మారేందుకు సిద్ధమైన​ మాజీ ఎమ్మెల్యేను  బీఆర్ఎస్​ నేతలు ఎత్తుకెళ్లడం​ గమనార్హం. 

మాజీమంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో  మీడియా సాక్షిగా ఆరూరిని గుంజుకెళ్లి వాహనాల్లో తీసుకెళ్లగా, జనగామ శివారు పెంబర్తి వద్ద  బీజేపీ లీడర్లు అటకాయించారు. వాహనంలోంచి రమేశ్​ను కిందికి గుంజే క్రమంలో జరిగిన పెనుగులాటలో ఆయన షర్ట్​ చినిగిపోయింది.  నడిరోడ్డుపై తనను వదిలేయాలంటూ చినిగిన షర్టుతో  ఇరు పార్టీల నేతలను ఆరూరి వేడుకున్నారు. 

ఉదయం ఆరూరి ఇంటి దగ్గర టెన్షన్​.. టెన్షన్​.. 

బీఆర్‍ఎస్‍ పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ ఇంటివద్ద బుధవారం ఉదయం నుంచే పెద్దఎత్తున హైడ్రామా నడిచింది. రమేశ్‍ బీఆర్ఎస్​ను వీడి బీజేపీలో చేరేందుకు సమాయత్తమయ్యారు. మంగళవారమే కేంద్ర మంత్రి అమిత్‍షా, కిషన్‍రెడ్డిని కలిసినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే బీఆర్‍ఎస్‍కు రాజీనామా ప్రకటన చేసేందుకు ఉదయం 10 గంటలకు ప్రెస్‍మీట్‍ ఏర్పా టు చేశారు. దీంతో హనుమకొండ ప్రశాంత్‍నగర్‍లోని ఆయన నివాసానికి జర్నలిస్టులు చేరుకున్నారు.  

మరికాసేపట్లో ప్రెస్​మీట్​ మొదలవుతుందనగా.. ఐదు నిమిషాల తేడాతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‍ మాజీ చైర్మన్‍ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్లు సుందర్‍రాజ్‍యాదవ్‍, మర్రి యాదవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‍ గుండ్రెడ్డి రాజేశ్వర్‍రెడ్డి తదితరులు రమేశ్ ఇంటికి చేరుకున్నారు. 

రమేశ్​ను బుజ్జగించేందుకు హరీశ్​రావు  పంపించారని ప్రెస్​మీట్‍ పాయింట్​ ‍నుంచి మాజీ ఎమ్మెల్యేను గదిలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమతో హైదరాబాద్​ రావాలంటూ పట్టుబట్టారు. రమేశ్‍, ఆయన అనుచరులు తిరస్కరించడంతో బీఆర్‍ఎస్‍ లీడర్లు రమేశ్‍ చుట్టూ చేరి చేతులు, నడుం పట్టుకుని మీడియా ముందే బలవంతంగా బయటకు గుంజుకుంటూ వచ్చారు. 

కనీసం చెప్పులు వేసుకునే అవకాశం ఇవ్వలేదు. తనను వదిలేయాలని ఆరూరి వారికి దండం పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నా వదల్లేదు.  ఆరూరి అనుచరులు, పార్టీ కార్యకర్తలు బీఆర్‍ఎస్‍ నేతల వాహనాలకు అడ్డుపడి రమేశ్‍కు అనుకూలంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్​ నేతలు అందరినీ తోసుకుంటూ రమేశ్​ను బలవంతంగా వారి వాహనాల్లో ఎక్కించుకొని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బీజేపీ హనుమకొండ, వరంగల్‍ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్‍ అక్కడికి చేరుకున్నారు. బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమైన ఆరూరి రమేశ్‍ను మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఇతర బీఆర్‍ఎస్‍ నేతలు గుండాల్లా ఎత్తుకెళ్లడం దుర్మా ర్గపు చర్య అని ఫైర్​ అయ్యారు. 

మధ్యలో అడ్డుకున్న బీజేపీ నేతలు.. 

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను హైదరాబాద్​ తీసుకెళ్తున్న సంగతి తెలుసుకున్న బీజేపీ లీడర్లు  జనగామ శివారు పెంబర్తి వద్ద బీఆర్ఎస్​ లీడర్ల వాహనాలను అడ్డుకున్నారు. జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​ రెడ్డితో పాటు స్థానిక లీడర్లు ‘భారత్​ మాతాకీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే రమేశ్​ ఉన్న కారును కదలనివ్వలేదు. 

ఆరూరి కారు దిగాలని పట్టుబట్టారు. రమేశ్ ​సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా బీజేపీ లీడర్లు వినలేదు. ఎర్రబెల్లి కారు దిగి వేరే కారులో వెళ్లాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో రమేశ్​ను బీజేపీ నేతలు కారు నుంచి కిందికి లాగడంతో పెనుగులాటలో ఆరూరి షర్ట్​ చినిగింది. చివరికి చిరిగిన షర్ట్​తో నడిరోడ్డుపై కిందికి దిగక తప్పలేదు. ఈ క్రమంలో దశమంత్​ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డితో  రమేశ్​ను ఫోన్​లో మాట్లాడించారు. కేసీఆర్​ను కలిసిన తర్వాత తాను బీజేపీ ఆఫీస్​కు వచ్చి కలుస్తానని కిషన్​ రెడ్డితో ఆరూరి చెప్పారు. దీంతో బీజేపీ శ్రేణులు వెనక్కితగ్గగా ఆయన తిరిగి అదే చిరిగిన షర్ట్​తో ఎర్రబెల్లి కారు ఎక్కేసి హైదరాబాద్​ వెళ్లి పోయారు.  

 బీఆర్ఎస్​లోనే ఉంటా.. కానీ పోటీచేయను: ఆరూరి

అత్యంత నాటకీయ పరిణామాల నడుమ హైదరాబాద్​లోని కేసీఆర్​ ఇంటికి చేరుకున్న  మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ చివర్లో బీఆర్ఎస్​ అధినేతకు ట్విస్ట్​ ఇచ్చారు. ఆరూరి రమేశ్​ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య బలవంతంగా నందినగర్​లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. ఫాంహౌస్ నుంచి వచ్చిన మాజీ సీఎం.. ఆరూరి సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యనేతలతో  సమావేశమై చర్చించారు. 

కాగా, తాను ఎట్టిపరిస్థితుల్లో వరంగల్​ నుంచి పోటీచేయబోనని, టికెట్​ ఎవరికి ఇచ్చినా సహకరిస్తానని ఆరూరి స్పష్టం చేయడంతో కడియం కావ్యను అభ్యర్థిగా కేసీఆర్​ ప్రకటించారు. కాగా, ఆరూరి రమేశ్​ మీడియాతో మాట్లాడుతూ తాను బీఆర్ఎస్​లోనే కొనసాగుతానని చెప్పారు. బీఆర్ఎస్​ నేతలు కిడ్నాప్​ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే..  తమ పార్టీ నేతలు తనను తీసుకొస్తే కిడ్నాప్​ ఎలా అవుతుందని ఉల్టా ప్రశ్నించడం కొసమెరుపు.