పోలీసులపై రేప్​ కేసు పెట్టాలి .. ఎస్టీ కమిషన్‌‌‌‌కు బీఆర్‌‌‌‌ఎస్ నేతల ఫిర్యాదు : చైర్మన్ బక్కి వెంకటయ్య

  • ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారం చేసినట్టు తేలితే కఠిన చర్యలు

హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనలో పోలీసులపై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అధికారులపై దాడి చేశారన్న నెపంతో మహిళలపై పోలీసులు లైంగికదాడులకు పాల్పడ్డారని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బాధిత మహిళలతో కలిసి శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ను కలిశారు. కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. రైతులు దాడులు చేశారన్న కారణంతో అర్ధరాత్రి ఇంటిపైకి వచ్చి మహిళలను బూతులు తిట్టారని, లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్​ కేసులు నమోదు చేయాలని కమిషన్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి పరాకాష్ట పాలనకు లగచర్లలో పోలీసుల అమానుష దాడి ఉదాహరణ అని సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిలెబుల్​ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీని మెప్పించేందుకు పెడుతున్న దృష్టిలో 10 శాతమైనా ఇక్కడి ప్రజలపై పెట్టాలని సూచించారు. 

లగచర్లలో నిజానికి ఎస్సీ, ఎస్టీలపైనే దాడి జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు దాడులు చేశారన్న నెపంతో ఎస్సీ, ఎస్టీ మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ మహిళలు చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళపై చేస్తున్న దమనకాండను రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తున్నదని చెప్పారు.

అన్యాయం జరిగితే ఊరుకోం: వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో  కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామని తెలిపారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఫార్మా  పరిశ్రమ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమిషన్‌‌‌‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు జాన్సన్ నాయక్, రూప్ సింగ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు.