ఇందూరు జడ్పీ చైర్మన్ పై అవిశ్వాసం?

ఇందూరు జడ్పీ చైర్మన్ పై అవిశ్వాసం?
  • పదవి నుంచి తప్పించేందుకు మెజార్టీ సభ్యుల ప్రయత్నాలు
  • ఇప్పటికే రెండు చోట్ల సీక్రెట్​గా సమావేశమైన సొంత పార్టీ జడ్పీటీసీలు
  • కేసీఆర్​తో బంధుత్వం కారణంగా ఇన్నాళ్లు సభ్యులను ఖాతరు చేయని విఠల్​రావు
  • గులాబీ పార్టీలో అసమ్మతి సెగ

నిజామాబాద్, వెలుగు: జడ్పీ చైర్మన్​ దాదన్నగారి విఠల్​రావును ఆ పదవి నుంచి తప్పించేందుకు సొంత బీఆర్ఎస్​ పార్టీ జడ్పీటీసీ సభ్యులు పావులు కదుపుతున్నారు. ఏండ్ల నుంచి ఆయన మీద ఉన్న అసంతృప్తిని ఇన్నాళ్లు కంట్రోల్​చేసుకున్న వారు, ఇక ఆగేలా కనిపించడం లేదు. పార్టీ చీఫ్​ కేసీఆర్​తో ఉన్న చుట్టరికంతో పెత్తనం చెలాయించి, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన చైర్మన్​ను కుర్చీ దింపాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్​ మారినందున ఇదే అదునుగా భావించి అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పరిషత్ పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగిస్తున్నప్పటికీ చైర్మన్​పై పంతం నెగ్గించుకోవాలని యోచిస్తున్నారు.

ఇక తగ్గేదేలే..

చైర్మన్ ​విఠల్​రావు తీరుపై సభ్యులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమను అసలు గౌరవించడం లేదని, పెత్తనం భరించలేకపోతున్నామంటూ జడ్పీటీసీలు పలుమార్లు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ హయాంలో జిల్లా మంత్రిగా ఉన్న ప్రశాంత్​రెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్, బోధన్​ మాజీ ఎమ్మెల్యేలు జీవన్​రెడ్డి, షకీల్​తో విఠల్​రావుకు అసలు గిట్టేదికాదు. విఠల్​రావుకు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి చాలాసార్లు మాటల యుద్ధం జరిగింది. తన కొడుకు బాజిరెడ్డి జగన్​కు దక్కాల్సిన చైర్మన్​ పదవిని లాక్కున్నారని అప్పటి రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​కు సైతం విఠల్​రావు అంటే పడేది కాదు.

2023, అక్టోబర్​లో జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​కు సభ్యులంతా మూకుమ్మడిగా గైర్హాజరై అవిశ్వాస సంకేతాలు ఇచ్చారు. ఆయన్ను తప్పించాల్సిందేనని ఎమ్మెల్సీ కవితను పట్టుబట్టారు. అసెంబ్లీ ఎలక్షన్ టైమ్​లో అవిశ్వాస రాజకీయాలు వద్దని ఆమె నచ్చజెప్పడంతో మెత్తబడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ మారడంతో చైర్మన్ ​విఠల్​రావుకు అండగా ఉండే పెద్ద మనుషులు లేనందున పదవి నుంచి దింపడానికి రంగం సిద్ధం చేశారు.

బోధన్, బాల్కొండ లీడర్ల కీ రోల్​​

విఠల్​రావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయమై బీఆర్ఎస్​ జడ్పీటీసీలు ఇప్పటికే  ఆర్మూర్, నిజామాబాద్​లో సీక్రెట్​గా మీటింగ్ ​నిర్వహించుకున్నట్లు సమాచారం. బోధన్, బాల్కొండ సెగ్మెంట్​లీడర్లు విఠల్​రావుకు యాంటీగా కీ రోల్ ​పోషిస్తున్నారు. ఆయన్ను తప్పిస్తే మిగిలిన ఐదు నెలల కోసం కొత్త చైర్మన్​ఎన్నిక జరపరని, ఇన్​చార్జి చైర్​పర్సన్​గా తానే ఉండొచ్చని వైస్ ​చైర్​పర్సన్​ రజిత ​ఆశగా ఉన్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికై.. చైర్మన్​గా

2019, మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలో అప్పడు 27 మండలాలు ఉండగా బీఆర్ఎస్​ 22, కాంగ్రెస్, బీజేపీలు రెండు జడ్పీటీసీలు గెలిచాయి. మాక్లూర్​మండలం నుంచి విఠల్​రావు ఒక్కరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్​ భార్య శోభ తరఫు బంధువైన విఠల్​రావు గత గవర్నమెంట్​ హయాంలో జిల్లాలో తనదైన పెత్తనం చెలాయించే వారు. ప్లాన్​ప్రకారం చైర్మన్​ పదవిని ఓసీ జనరల్​కు రిజర్వ్​ చేయించుకొని పదవిలో కూర్చున్నారు.

దీంతో ఆ పదవిని ఆశించిన ధర్పల్లి బాజిరెడ్డి జగన్, బోధన్ ​జడ్పీటీసీ లక్ష్మీబాయికి భంగపాటు తప్పలేదు. పైసా ఖర్చులేకుండా జడ్పీటీసీ ఎన్నికై,  చైర్మన్​కుర్చీ సొంతం చేసుకున్న విఠల్​రావుపై మొదటి నుంచి చాలా మంది సభ్యుల్లో గుస్సా ఉంది. పైగా సభ్యులను గౌరవించని అతని తీరును ఇంతకాలం భరిస్తూ వస్తున్నారు.