- కలెక్టరేట్లో గంట వేయిట్ చేసిన కౌన్సిలర్లు
- క్యాంపులో ‘గుట్ట’ కౌన్సిలర్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో అవిశ్వాసం తీర్మానాల హీట్ పెరుగుతోంది. ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసును మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతికి ఇచ్చారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పదిమంది సంతకాలు చేశారు. చైర్మన్‌గా శంకరయ్య ఎన్నికైనప్పటి నుంచీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ప్రతిపక్ష లీడర్లు అసంతృప్తిగానే ఉన్నారు. చైర్మన్ ఎవరినీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని రెండేండ్ల క్రితం కౌన్సిలర్లంతా తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత జోక్యం చేసుకొని సర్ది చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయినా చైర్మన్ తీరులో మార్పు లేదని కౌన్సిలర్లు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరుగురు, ఇండిపెండెంట్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు కలెక్టరేట్‌కు వెళ్లారు. అయితే గంటపాటు బయటే వేయిట్ చేసినా కలెక్టర్ పమేలా సత్పతి బయటకు రాలేదని కౌన్సిలర్లు చెప్పారు. చివరకు కలెక్టర్ బయటకు వచ్చి కారులో కూర్చోవడంతో అక్కడికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.
రంగంలోకి డీసీసీబీ చైర్మన్...
ఆలేరు మున్పిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలువగానే డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి కౌన్సిలర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చివరకు బీఆర్ఎస్ లీడర్లతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్‌ను కలెక్టరేట్‌కు పంపించారు. అక్కడే ఉన్న కౌన్సిలర్లతో బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడి అవిశ్వాసం నోటీసు ఇవ్వకుండా ప్రయత్నించారు. అయినా కౌన్సిలర్లు కలెక్టర్‍కు నోటీసు అందించారు. అనంతరం అక్కడి నుంచి కౌన్సిలర్లను మహేందర్‌రెడ్డి వద్దకు తరలించారు. అంతర్గత విబేధాలను బయట పెట్టడం సరికాదని నచ్చచెప్పినట్టు తెలిసింది. కాగా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ చైర్మన్ ఎరుకుల సుధపై కౌన్సిలర్లు సోమవారం అవిశ్వాసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
క్యాంపులో గుట్ట కౌన్సిలర్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌన్సిలర్లు క్యాంప్ కు వెళ్లారు. వారంరోజుల పాటు క్యాంప్ లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏరోజు ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. క్యాపులో ఉన్న కౌన్సిలర్లు మంగళవారం కొమురవెల్లి మల్లన్న, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మంగళగిరిలో రాత్రి బస చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చైర్ పర్సన్ పదవి ఇస్తామని ఎమ్మెల్యే సునీత హామీ ఇవ్వడంతోనే కౌన్సిలర్ వాణీ బీఆర్ఎస్లో చేరినట్టు ఆపార్టీ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే గొంగిడి దంపతుల మద్దతు తనకు ఉందని ప్రస్తుత చైర్ పర్సన్ సుధ చెప్తుండగా, గొంగిడి దంపతుల కనుసన్నల్లోనే వాణీ భరత్ కౌన్సిలర్లను క్యాంప్ నకు తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.