- సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర కబ్జాలు
- ఎటువంటి ఇండ్లు లేకున్నా జీవో 58,59 కింద క్రమబద్ధీకరణ
- అక్రమార్కుల్లో జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ మంత్రి అనుచరులు, చుట్టాలు
- గుడిసెలు తొలగించి గులాబీ లీడర్లకు పట్టాలిచ్చిన రెవెన్యూ ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు : మాజీ మంత్రి అండదండలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హాంఫట్ చేసేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన ఐదెకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాజేశారు. ఇండ్లు లేకున్నా 58,59 జీవోల కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు. అప్పనంగా భూములు కొట్టేసిన వారిలో సాక్షాత్తు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు, ఆయన చుట్టాలు ఉండడం గమనార్హం. అప్పటికే ఆ భూమిలో ఇండ్లు లేని పేదోళ్లు గుడిసెలు వేసుకోగా..వాటిని తొలగించి గులాబీ లీడర్లు ఆక్రమించుకున్నారు. ఆపై పట్టాలిచ్చి రెవెన్యూ అధికారులు తమ భక్తిని చాటుకున్నారు.
ఇండ్లు లేకున్నా రెగ్యులరైజేషన్
వివాదాలు లేని ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో ఇండ్లు కట్టుకున్న పేదల స్థలాల రెగ్యులజేషన్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 58, 59 తెచ్చింది. దీని ప్రకారం 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు కబ్జాలో ఉన్న ఇండ్ల జాగలకు జీవో 58 ప్రకారం125 చదరపు గజాల్లోపు ఉచితంగా..125 గజాలు దాటితే జీవో 59 కింద మార్కెట్ రేటు ప్రకారం కట్టి క్రమబద్దీకరించుకోవాలి. అది కూడా ప్రభుత్వ భూములతో పాటు అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలో ఉన్న భూముల్లో ఉన్న ఇండ్లను మాత్రమే రెగ్యులరైజ్ చేయాలి.
ఈ ఇండ్లు కూడా 2020 జూన్ 2నాటికి కట్టుకున్నవి మాత్రమే అయ్యి ఉండాలి. ఆధారాలుగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, కరెంట్ బిల్లు ఉండాలన్న నిబంధన ఉంది. అయితే, సూర్యాపేటలోని కలెక్టరేట్సమీపంలో ఉన్న కుడ కుడ ఏరియా వద్ద 126 సర్వే నంబర్లో జాగాపై కన్నేసిన మాజీ మంత్రి, సూర్యాపేట
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అనుచరులు నిర్మాణాలు చేపట్టకుండానే ఆక్రమించుకున్నారు. ఇందుకు రెవెన్యూ ఆఫీసర్లు సహకరించి పట్టాలు కూడా ఇచ్చారు.
ఐదెకరాలు...90 మంది
కుడ కుడలోని సర్వే నెంబర్ 126లో 90 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, సుమారు ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు భూమిని 90 మంది గులాబీ లీడర్లకు జీవో 58, 59 కింద రెగ్యులరైజ్ చేశారు. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోనే ఉండడంతో ఒక్కో ఎకరం ధర రూ.5 కోట్లు పలుకుతోంది. దీంతో 90 మంది ఒక్కొక్కరు 200 నుంచి 400 గజాల వరకు రెగ్యులరైజ్ చేసుకున్నారు. జీవో 59కింద 76 మంది, జీవో 58 కింద14మంది క్రమబద్ధీకరించుకున్నారు. ఇందులో జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మార్కెట్ కమిటీ మెంబర్లు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు
బంధువులు ఉండడం గమనార్హం. వీరిలో కొంతమంది తమ పేర్లపై రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఎన్నో ఏండ్లుగా126 సర్వే నంబర్లో ఇండ్లు కట్టుకొని ఉంటూ జీవో నంబర్58 కింద దరఖాస్తు చేసుకున్న వారిని రిజెక్ట్ చేసిన రెవెన్యూ ఆఫీసర్లు..ఎలాంటి ఇండ్లు లేని బీఆర్ఎస్ లీడర్ల అప్లికేషన్లను మాత్రం అంగీకరించి రిజిస్ట్రేషన్ చేశారు.
పేదోళ్ల గుడిసెలు తొలగించి..
కుడకుడ సర్వే నెంబర్ 126లో గతంలో పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. 2018 నుంచి ప్రభుత్వం తమకు పట్టాలివ్వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే, రెవెన్యూ ఆఫీసర్లు పోలీసుల సమక్షంలో పేదలు వేసుకున్న గుడిసెలను ఎన్నోసార్లు తొలగించారు. అంతేకాకుండా ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అరెస్ట్ చేసి జైళ్లకు కూడా పంపారు. దీంతో తమకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఎన్నోసార్లు కలిసి వేడుకున్నారు. అయినా వారి విషయంలో ఏనాడూ స్పందించలేదు. కానీ, ఆయన అనుచరులు, బంధువులు, బీఆర్ఎస్లీడర్ల పేరిట మాత్రం సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ జరగడం కొసమెరుపు.