కరీంనగర్ : జిల్లాల్లో అధికార బీఆర్ఎస్ లీడర్ల అరాచకాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. బడా నేతల మీటింగ్లకు ఇష్టం లేకపోయినా రావాలంటూ ఒత్తిడి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. అలాంటి ఘటనే కరీంనగర్లో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియోలో వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలో 2023, జూన్ 21వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. ఆయన మీటింగ్కు హాజరు కావాలని ఆదేశిస్తూ లక్ష్మీ నగర్ బీఆర్ఎస్ నేత రమ హుకుం జారీ చేశారు. ప్రతి మహిళా సంఘం నుంచి కనీసం ఎనిమిది మంది హాజరుకావాలని.. లేదంటే రూ.100 ఫైన్ కట్టాలని ఆదేశించటం లీడర్లను విస్మయానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. తమకు ఇష్టం లేకున్నా మీటింగ్ రావాలని హెచ్చరించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మీటింగ్ కు జనం తక్కువగా వస్తే పార్టీకి ఇబ్బంది అని.. జనం ఎక్కువగా కనిపించాలని బీఆర్ఎస్ నేతలు తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే జనాన్ని తరలించటానికి ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి.. ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారు. సభకు రాకపోతే జరిమానా వేస్తామని.. నిధులు విడుదల చేయం అని బెదిరింపులకు దిగుతున్నట్లు.. వైరల్ అయిన ఆడియో చూస్తే అర్థం అవుతుంది.