బీఆర్ఎస్ పాలిటిక్స్.. ఉద్యోగులే టార్గెట్!

బీఆర్ఎస్ పాలిటిక్స్.. ఉద్యోగులే టార్గెట్!
  • ఎంప్లాయీస్ పైకి జనాన్ని ఉసిగొల్పేలా ఆ పార్టీ నేతల కామెంట్లు
  • కులగణనకు వచ్చేవారిని అడ్డుకోవాలని కేటీఆర్ స్టేట్​మెంట్ 
  • చాలా చోట్ల ఎన్యుమరేటర్లకు వేధింపులు.. కుక్కనూ వదిలిన ఓ ఇంటి ఓనర్  
  • లగచర్లలో కలెక్టర్​ను ఊర్లోకి తీస్కెళ్లి దాడి చేయించిన బీఆర్ఎస్ నేత 
  • దళితబంధు ధర్నాలో లబ్ధిదారులను రెచ్చగొట్టిన కౌశిక్​ రెడ్డి
  • లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి పోలీసులపై బద్నాం 

హైదరాబాద్, వెలుగు:  రాజకీయంగా కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేతలు, అందుకోసం ప్రభుత్వ యంత్రాంగంపైకి తమ పార్టీ కార్యకర్తలను, కొన్నిచోట్ల జనాల్ని ఉసిగొల్పడంపై విమర్శలు వస్తున్నాయి. కులగణన మొదలుకుని.. ఫార్మా విలేజ్ భూసేకరణ వరకూ ఆఫీసర్లే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి వస్తుందని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు చేసి బలి కావొద్దంటూ ఉద్యోగులకు, అధికారులకు, పోలీసులకు ఆ పార్టీ నేతలు నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. కులగణన చేస్తున్న ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం, ఫార్మా విలేజ్​కు భూసేకరణపై ప్రజాభిప్రాయం తీసుకునేందుకు వచ్చిన కలెక్టర్​పైనే దాడికి తెగబడడం, దళితబంధు ఇప్పిస్తానని చెప్పి, వచ్చినవాళ్లను రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడం లాంటి ఘటనలే ఉద్యోగులపై దాడులకు ఊతమిస్తున్నాయి.

కులగణనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు

బీసీ రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వ, సంక్షేమ పథకాల పకడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. అయితే ఈ కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్ స్వయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం వరంగల్ లో ఆయన మాట్లాడుతూ.. కులగణనకు వచ్చే ఆఫీసర్లను నిలదీయాలని పార్టీ క్యాడర్​కు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అయిన వ్యక్తే ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడడంతో చాలా మంది బీఆర్ఎస్ సానుభూతిపరులు, పలువురు జనాలూ కులగణనకు వచ్చే ఎన్యుమరేటర్లపై ఎదురుతిరుగుతున్నారు. 

చాలా చోట్ల ఉద్యోగులు వేధింపులను ఎదుర్కొంటున్నారు. పలువురు మహిళా ఉద్యోగులను వీడియోలు తీస్తూ  వేధింపులకు గురి చేశారు. హైదరాబాద్ సిటీలో అయితే కులగణన వివరాలను తీసుకునేందుకు వెళ్లిన ఎన్యుమరేటర్​పై ఓ ఇంటి యజమాని ఏకంగా కుక్కను వదిలే దాకా పరిస్థితి వెళ్లింది. ఇప్పటికీ చాలా చోట్ల కులగణన చేస్తున్న ఎన్యుమరేటర్లకు అడపాదడపా ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. హామీలపైనే ప్రశ్నించాలనుకుంటే రాజకీయ నాయకులను నిలదీయాల్సిందిపోయి.. కేవలం డ్యూటీ చేసే తమలాంటి ఉద్యోగులను ఇలా అడ్డుకోవడం, అభ్యంతరకరంగా మాట్లాడడం ఏమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల మధ్య తాము ఎందుకు నలిగిపోవాలని వారు వాపోతున్నారు. 

లగచర్ల ఘటన కూడా అంతే..

లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి ఘటన కూడా కావాలని చేసిన కుట్రగానే కాంగ్రెస్ నేతలు, పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఊరి బయట ఉన్న కలెక్టర్, అధికారులను ఊర్లోకి తీసుకొచ్చి, దాడి చేయించింది బీఆర్ఎస్ కార్యకర్త అయిన సురేశ్​అని విచారణలో తేలింది. దాడి జరిగిన రోజున పలుమార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సురేశ్ ఫోన్ లో మాట్లాడినట్టు అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్​లు సంపాదించారు. అదేసమయంలో నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్​తో మాట్లాడినట్టు ఆధారాలు దొరికాయి. 

దీంతో గిరిజన రైతులను బీఆర్ఎస్ నేతలే కావాలని కలెక్టర్, అధికారులపై దాడి చేసేలా ఉసిగొల్పారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. భూమి పోతున్నప్పుడు కలెక్టర్​ను సురేశ్ బరాబర్ నిలదీస్తాడంటూ ప్రెస్​మీట్​లో స్వయంగా కేటీఆరే చెప్పారు. కానీ భూసేకరణ నోటిఫికేషన్ లో ఉన్న భూముల్లో సురేశ్ కు, మరో 19 మంది నిందితులకు చెందిన భూములు లేవని, ఫార్మా విలేజ్ కు, వాళ్లకు సంబంధమే లేదని పోలీసులు చెప్తున్నారు.  

హుజూరాబాద్​లో పోలీసులను రెచ్చగొట్టి..

ఇటీవల దళితబంధు పేరుతో లబ్ధిదారులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టారన్న ఆరోపణలూ ఉన్నాయి. గత  సోమవారం హుజూరాబాద్​లో ధర్నా సందర్భంగా కౌశిక్ రెడ్డి పోలీసులపైకి కావాలనే రెచ్చగొట్టేలా కామెంట్లు చేశారంటున్నారు. కావాలని అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూను సృష్టించి దానిని పోలీసులపైకి నెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఘర్షణలోనే పోలీసులు కౌశిక్​ రెడ్డిని అరెస్ట్ చేస్తుండగా ఆయన గాయపడ్డారని రాద్ధాంతం చేశారు. 

అనంతరం తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. వికారాబాద్ ఘటనను పదే పదే ప్రస్తావించారు. దళితబంధు విషయంలోనూ ఇలాగే జరుగుతుందని, అధికారులను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలన్నీ సర్కారును టార్గెట్​చేసిన బీఆర్ఎస్​అందుకోసం ఉద్యోగులను బలిచేస్తోందన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసు, ఫోన్​ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందుతుండడంతో.. వీటిని డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయాలకు తెరలేపిందని పలువురు అభిప్రాయపడ్తున్నారు.