బీఆర్ఎస్​ లీడర్లకు నిరసన సెగ

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్​మండలంలోని మల్లూర్​లో సోమవారం బీఆర్ఎస్​లీడర్లకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే హన్మంత్​షిండ్​ వస్తుండగా, ఆయన కంటే ముందే బీఆర్ఎస్​కు చెందిన పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు మల్లూరుకు వచ్చారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గ్రామాన్ని దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని గ్రామస్తులు మండిపడ్డారు. రెండేండ్ల కిందే గ్రామంలో ఆరోగ్య కేంద్రం బిల్డింగ్​ నిర్మాణం పూర్తయినా, ప్రారంభించేందుకు ఎమ్మెల్యేకు ఇప్పటివరకు టైమ్​ దొరకలేదా అని  ప్రశ్నించారు. 

దీంతో బీఆర్ఎస్ లీడర్లు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కలగజేసుకొని గొడవను సద్దుమణిగించారు. అనంతరం ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ జుక్కల్​నియోజకవర్గ అభివృద్ధికి కోరిక వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్​ దఫేదర్ ​రాజు, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, వైస్ ఎంపీపీ మనోహర్ పాల్గొన్నారు.