బాల్క సుమన్ విధానాలు నచ్చక బీఆర్ఎస్ లీడర్లు రాజీనామా

బాల్క సుమన్ విధానాలు నచ్చక  బీఆర్ఎస్ లీడర్లు రాజీనామా

కోల్​బెల్ట్​, వెలుగు :  మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు బీఆర్ఎస్​ లీడర్లు, యువకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం మందమర్రి పట్టణం శ్రీకృష్ణ ఫంక్షన్​ హాల్​లో బీఆర్ఎస్​ స్టూడెంట్​ విభాగం స్టేట్  సెక్రటరీ ఎండీ ముజాహిద్, క్యాతనపల్లి మున్సిపల్ ​ 15వ కౌన్సిలర్​ భర్త, యూత్  ప్రెసిడెంట్  బింగి శివకిరణ్, మందమర్రి 17వ వార్డు ప్రెసిడెంట్  పోలు నరేశ్, క్యాతనపల్లి సోషల్ మీడియా ఇన్ చార్జి ఎండీ ఇందాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్  లీడర్లు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాల్క సుమన్  అహంకార వైఖరికి నిరసనగా, కార్యకర్తలు, ప్రజల ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్​  పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి 2018 ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా సుమన్​ను  ఎన్నుకున్నామని, కానీ నాలుగున్నర ఏళ్లలో  నియోజకవర్గ ప్రజలను ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా  మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. 

‘‘ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా సుమన్  సమయం ఇవ్వడం లేదు. 2018 నుంచి పనిచేసిన యువకులను పట్టించుకోకుండా  సోషల్​ మీడియా బాధ్యులంటూ కొత్తగా మరో 300 మంది యువకులను నష్టపరిచే విధానాలకు తెరదీసిండు. సీఎం కేసీఆర్, సుమన్​ మందమర్రి మున్సిపాలిటికి ఎన్నికలు జరిపిస్తామన్నరు. మందమర్రిలో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన్రు. ఏళ్లు గడుస్తున్నా క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి పనులు పూర్తి చేయించలే. 

లెదర్​పార్కును అందుబాటులోకి తీసుకురాలే. ప్రగతిభవన్​ మెప్పు కోసం నియోజకవర్గంలో సెంట్రల్​ లైటింగ్, పార్కులు నిర్మిస్తున్నాడు తప్ప మౌలిక వసతులు,  శాశ్వత ప్రయోజనాలను పట్టించుకుంటలే” అని బీఆర్ఎస్  లీడర్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ వల్ల నియోజకవర్గంలోని వేల ఎరాలు మునిగి రైతులు నష్టపోతే పరిహారం ఇప్పించలేకపోయారని మండిపడ్డారు. తామంతా తర్వలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని వెల్లడించారు.