సిరిసిల్లలో మరో 6 ఎకరాలు వాపస్.. అసైన్డ్​ భూములు వెనక్కి ఇస్తున్న బీఆర్ఎస్​ నేతలు

  • అసైన్డ్​ భూములను వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్​ నేతలు
  • సిరిసిల్ల కలెక్టర్​కు పాస్​బుక్స్ అప్పగించిన ఇద్దరు లీడర్లు
  • ఇప్పటివరకూ 11 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్​ వెనక్కి
  • భూ కబ్జా కేసుల్లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గత బీఆర్ఎస్​ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలో  సర్కార్, అసైన్డ్  భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న లీడర్లు తిరిగి ఇచ్చేస్తున్నారు. అక్రమ పట్టాలు పొందినవారిపై కలెక్టర్​ కేసులు పెట్టి జైలుకు పంపుతుండడంతో.. కొందరు తమ వంతురాకముందే సరెండర్ అవుతున్నారు. ఈ అసైన్డ్ భూమి తమకు వద్దంటూ పట్టాదారుపాస్ బుక్స్ ను వాపస్ చేస్తున్నారు.

 తాజాగా.. బుధవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కూరవేణి నర్సయ్య  5 ఎకరాలు, మండెపల్లికి చెందిన మోస లింగం ఎకరం భూమిని  కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు స్వచ్ఛందంగా అప్పగించారు. కాగా, ఒక్కొక్కరుగా వచ్చి భూమిని వెనక్కి ఇచ్చేస్తుండడంతో  ఈ జాబితాలో ఇంకెంతమంది ఉన్నారోనన్న చర్చ జోరుగా సాగుతున్నది.

ఇప్పటివరకూ 11 ఎకరాలు అప్పగించిన్రు 

తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ సర్పంచ్ మిట్టపల్లి పద్మ సర్వేనంబర్ 545/13/1 లోని 2 ఎకరాల భూమిని కలెక్టర్ కు తొలుత అప్పజెప్పారు. ఇదే మండలం సారంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 464 లోని 3ఎకరాల ప్రభుత్వ భూమిని సుంచుల కుమారస్వామి వాపస్ చేశారు. తాజాగా.. ఇదే సర్వేనంబర్ లో 5 ఎకరాలపైన అక్రమంగా లావుణి పట్టా పొందిన కూరవేణి నర్సయ్య తన పాస్‌‌‌‌ పుస్తకాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఇచ్చేశారు. అలాగే, ఇదే మండంలం మండెపల్లికి చెందిన మరో వ్యక్తి మోస లింగం 365 సర్వే నంబర్ లోని ఎకరం భూమి లావుణి పట్టా పొందారు. 

ఆయన కూడా స్వచ్ఛందంగా ఆ భూమిని కలెక్టర్ కు వాపస్ చేశారు. దీంతో ఇప్పటి వరకు కలెక్టర్ కు వాపస్ చేసిన అసైన్డ్ ల్యాండ్ 11 ఎకరాలకు చేరింది. వీరందరూ 2018 నుంచి రైతు బంధు, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పొందిన డబ్బులను రికవరీ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.  

అక్రమంగా పట్టాలు పొందిన 9 మంది అరెస్ట్

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొందరు బీఆర్ఎస్ లీడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. 2017, 2018లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఆ భూములను తమ పేర్ల మీదికి మార్చుకున్నారు. ఈ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వివరాలు తెప్పించుకొని సుమారు 300 ఎకరాల  భూమిని ప్రభుత్వ భూమి కింద మార్చేశారు. అంతేగాక అక్రమార్కులపై కేసులు నమోదు చేయగా, ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ లో అసైన్డ్​ భూమిలో క్రషర్​ నడుపుతున్న కేటీఆర్ ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్​ను అరెస్ట్ చేశారు. సర్దాపూర్ గ్రామానికి చెందిన అగ్గి రాములు, సిరిసిల్ల పట్టణానికి చెందిన జిందం దేవదాస్, తాడూరుకు చెందిన సురభి నవీన్​ రావు, నేరేళ్ల సింగిల్ విండో చైర్మన్ పూడూరి భాస్కర్,  పెద్దూర్​కు చెందిన సలేంద్రి బాల్ రాజు, గంగుల బాలయ్య, తంగళ్లపల్లి మండల మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బీఆర్​ఎస్ నాయకుడు బండి దేవదాస్ ను భూకబ్జాల కేసులో జైలుకు పంపారు. లావణి పట్టాల అక్రమాల చిట్టాను పరిశీలిస్తే మరింత మంది జైలుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తున్నది. అందుకే అక్రమంగా పట్టాలు చేసుకున్న భూములను లీడర్లే స్వచ్ఛందంగా వాపస్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.  

స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వాలి 

జిల్లాలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను కబ్జా చేసినవారు, అక్రమంగా అసైన్డ్ చేసుకున్నవారు స్వచ్ఛందంగా వాపస్ చేయాలి. అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ పట్టాలు పొందిన వారు  స్వచ్ఛందంగా వచ్చి భూమిని వాపస్ చేస్తే తిరిగి ఆ భూములను అర్హులైన పేదలకు కేటాయిస్తాం. సందీప్​ కుమార్ ఝా, కలెక్టర్, రాజన్న సిరిసిల్ల