కేసీఆర్ పాలనలో.. పందుల స్కాం ఏంటీ.. ఎలా జరిగింది.. ఎలా బయటకొచ్చింది.. ?

కేసీఆర్ పాలనలో.. పందుల స్కాం ఏంటీ.. ఎలా జరిగింది.. ఎలా బయటకొచ్చింది.. ?

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో  పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతలు  కోటి రూపాయలకు పైగా గోల్ మాల్  చేశారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.  అసలు పందుల స్కాం ఏంటీ ఎలా జరిగింది. ఎలా బయటకొచ్చిందనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

అసలేం జరిగిందంటే..

జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల బెడద తీవ్రంగా ఉందని, వ్యాధుల బారిన పడ్తున్నామని, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జనం నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ హయాంలో  మున్సిపల్ చైర్​పర్సన్ భర్త దోరేపల్లి రవీందర్ పెంపకందార్లను పిలిచి వెంటనే పందులను పట్టణం నుంచి తరలించాలని ఆదేశించారు. ఇందుకు కొంత సమయం కావాలని వారు కోరగా, రవీందర్ అందుకు నిరాకరించారు. గతేడాది సెప్టెంబర్​లో పందులు పట్టేవాళ్లను జడ్చర్లకు పిలిపించారు. పెంపకందారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసుల సాయంతో వారిని ఠాణాలో నిర్బంధించారు. నాలుగు విడతల్లో 80 టన్నుల పందులను పట్టించి, 20 లారీల్లో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు తరలించారు. పాలకవర్గం తీర్మానం, ఆఫీసర్ల పర్మిషన్ ​లేకుండా ఇదంతా చేశారు. పందులు కిలోకు రూ.139 చొప్పున అమ్ముడుపోవడం, పెద్దమొత్తంలో డబ్బులు రావడంతో డిసెంబర్​లో మరో 8 టన్నుల పందులను పట్టించి, రెండు వాహనాల్లో తరలించారు. విషయం తెలిసిన పందుల పెంపకందారులు ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు.

రూ.1.20 కోట్లు స్వాహా

జడ్చర్లలో పందుల నివారణ పేరుతో   రూ.1.20  కోట్లు స్వాహా చేయడం వెనుక  బీఆర్ఎస్   నేత, మున్సిపల్ చైర్​పర్సన్ లక్ష్మి భర్త రవీందర్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెంపకందారులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి మరీ 88 టన్నుల పందులను పట్టి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిరుడు సెప్టెంబర్​లో నాలుగు విడతల్లో 20 లారీల్లో 80 టన్నుల పందులను తరలించగా పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. దీంతో డిసెంబర్​లో మరోసారి 8 టన్నులు తరలించారు. పెంపకందారులు ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన మున్సిపల్ ​ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. పెంపంకందారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. పందులను కిలోకు రూ.139 చొప్పున అమ్ముకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పందుల ఇష్యూ మున్సిపల్ చైర్​పర్సన్ ​పదవికి ఎసరుపెట్టేలా కనిపిస్తోంది. ఆమెపై అవిశ్వాసానికి మెజారిటీ కౌన్సిలర్లు రెడీ అవుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడంతో విషయం బయటికి

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి అనిరుధ్​రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలవడంతో పందుల పెంపకందారులంతా ఆయనను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. రూ.కోటికి పైగా విలువజేసే పందులను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నారని తెలియడంతో ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసర్లను పిలిపించుకొని ఆరా తీశారు. పందులను పట్టేందుకు తాము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని, ఆ విషయమే తమకు తెలియదని బుకాయించారు. మరి పందులు ఏమయ్యాయని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. పోనీ, పందులను అమ్మిన డబ్బులను మున్సిపాలిటీ ఖాతాలో జమచేశారా? అని అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదన్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యే సూచన మేరకు పందుల పెంపకందారులు స్థానిక పోలీస్​స్టేషన్​లో జడ్పీ చైర్​పర్సన్ భర్త రవీందర్, పలువురు బీఆర్ఎస్ లీడర్లపై‌‌‌‌ ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ మొదలు పెట్టిన పోలీసులు 88 టన్నుల పందులను  రూ.1.20 కోట్లకు అమ్మారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.