బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు

బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు
  • లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సర్కార్‌‌‌‌పై అడ్డగోలు ఆరోపణలు 
  • కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంట్ పోయిందని కామెంట్లు
  • నీళ్ల మేనేజ్‌‌మెంట్ తెలుస్తలేదని, పాలన చేతకావట్లేదని విమర్శలు 
  • ప్రభుత్వంపై గులాబీ నేతలు చేసిన విమర్శలను పట్టించుకోని జనం 
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మవిమర్శ చేసుకోని పార్టీ పెద్దలు 
  • ప్రజలే తప్పు చేశారన్నట్టుగా నిందలు.. అభద్రతా భావంలోకి నెట్టేలా ప్రసంగాలు 
  • జనం కొట్టిన దెబ్బకు 37 నుంచి 16 శాతానికి పడిపోయిన పార్టీ ఓట్ షేర్ 

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల ప్రచారంలో తాము చెప్పిన అబద్ధాలే తమ కొంపముంచాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పకుండా, ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేయడం పార్టీకి మైనస్​గా మారిందని చెబుతున్నారు. ‘కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది.. కాంగ్రెస్​ వచ్చినంక కరెంట్ ఉంటలేదు..  మళ్లీ మోటర్లు కాలుతున్నయ్​..  కాళేశ్వరం నీళ్లను కావాలనే ఎత్తిపోస్తలేరు.. నీళ్లున్నా  పంటలను ఎండవెడ్తున్రు.. రైతులు పండించిన వడ్లను కొంటలేరు’ లాంటి కామెంట్లు చేయడం, మూడు నెలలు కూడా నిండని ప్రభుత్వంపై నిందలు వేయడం లాంటివి పార్టీని దెబ్బకొట్టాయని అంటున్నారు. 

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరించడం, ఏడాది తిరగకుండానే అధికారంలోకి వస్తామని కామెంట్లు చేయడం కూడా మైనస్ గా మారిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మవిమర్శ చేసుకోకుండా, ప్రభుత్వంపై గుడ్డిగా చేసిన ఆరోపణలను జనం పట్టించుకోలేదని.. పైగా ప్రజలే తప్పు చేశారన్నట్లు మాట్లాడడం వల్లే కర్రు కాల్చి వాతపెట్టారని అంచనా వేస్తున్నారు. ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతంగా ఉన్న ఓట్​షేర్​ ఆరు నెలలు తిరిగే సరికి 16 శాతానికి పడిపోయిందని పేర్కొంటున్నారు. 

కంచుకోట మెదక్​లోనూ ఓటమి.. 

అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి పైగా సిట్టింగ్ సీట్లను కోల్పోయిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌.. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మొత్తం 17 సీట్లలో ఓడిపోగా, అందులో 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు సాధించలేకపోయారు. పార్టీకి కంచుకోట వంటి మెదక్‌‌‌‌లో కూడా కనీసం గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 నియోజకవర్గాల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ గెలవగా, లోక్‌‌‌‌సభకు వచ్చేసరికి అందులో 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ అభ్యర్థులు మెజార్టీ సాధించారు. 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆత్మవిమర్శ చేసుకోకపోవడం, ఓడించినందుకు ప్రజలపై నిందలు వేయడం, ‘స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బాకే’ ఆ పార్టీ నేతలు పరిమితం కావడం, ప్రభుత్వాన్ని ఫామ్ చేసి కనీసం 3 నెలలు గడువక ముందే కాంగ్రెస్‌‌‌‌పై అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు చేయడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరించడం, ఏడాది తిరగకుండానే అధికారంలోకి వస్తామని కామెంట్లు చేయడమే ఇంతటి  ఘోరమైన పరాభవానికి కారణాలుగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

తప్పు చేశారంటూ ప్రజలపై నిందలు వేయడాన్ని, ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న హెచ్చరికలను ఓటర్లు సీరియస్‌‌‌‌గా తీసుకున్నారని.. పార్టీ అధినేత, ముఖ్య నాయకుల నుంచి వచ్చిన అలాంటి కామెంట్లతో పార్టీపై మరింత వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎంపీ సీట్లు ఇస్తే, కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌రావు పదే పదే అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేసిన వాళ్లు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తలు కూడా కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌రావు మాటలను పట్టించుకోకుండా బీజేపీ అభ్యర్థులకు గంపగుత్తగా ఓట్లు గుద్దారు. 

కరువు బెదిరింపులు

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి పాలన చేతకావడం లేదంటూ, వచ్చీరాగానే కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంట్ కోతలు మొదలయ్యాయని, సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని, రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్‌‌‌‌పై ఆగ్రహంగా, అసంతృప్తిగా ఉన్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రచారం చేయడం ప్రారంభించింది. కేసీఆర్ బస్సు యాత్రలో గడిసేపు కరెంట్ పోయినా, దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసింది. మేడిగడ్డ కుంగిపోతే అదో పెద్ద విషయమా.. ప్రాజెక్టులన్నంక కుంగిపోవా? అని చాలా తేలిగ్గా ఆ పార్టీ నేతలు మాట్లాడారు.

 ఇవన్నీ ప్రజల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై మరింత ఆగ్రహాన్ని పెంచాయి. తమ పార్టీ అధినేత, ముఖ్య నేతలు చేస్తున్న ఈ ప్రచారాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ శ్రేణులే పట్టించుకోలేదు. లోక్‌‌‌‌సభ ఎన్నికల ఫలితాలే ఈ అంశాన్ని స్పష్టం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీకి, లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో 16 శాతం ఓట్లే పడ్డాయి. సగానికి పైగా ఓట్లు బీజేపీకి మళ్లీపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లీడ్ సాధించింది. ఆ 7 నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు బీజేపీ పాగా వేసింది. 

మిగిలింది ఆ మూడే..

అసెంబ్లీ ఎన్నికల్లో 39 నియోజకవర్గాల్లో లీడ్ సాధించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌.. లోక్‌‌‌‌సభ ఎన్నికల నాటికి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో మాత్రమే లీడ్ సాధించగలిగింది. మిగిలిన 36 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థులే లీడ్ సాధించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బంపర్ మెజార్టీతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఇకనైనా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోకపోతే, భవిష్యత్తులో పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలపైనే నిందలు.. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫిబ్రవరిలో నల్గొండ సభ కోసం తొలిసారి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. ఆ మీటింగ్‌‌‌‌లో ఆయన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నవ్. అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా? మూడు పిల్లర్లు కుంగిపోతే పెద్ద రాద్దాంతం చేస్తున్నవ్‌‌‌‌. మమ్మల్ని  బద్నాం చేస్తవా? మిమ్మల్ని బతకనీయం.. వెంటాడుతాం.. వేటాడుతాం” అని హెచ్చరించారు. కాంగ్రెస్ రాగానే కరెంట్ పోయిందని, నీళ్ల తిప్పలు మొదలయ్యాయని ఆరోపించారు. ఆ తర్వాత మార్చిలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో సభ పెట్టి లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. “అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌‌‌‌కు ఓటేసిన్రు”అంటూ జనంపై నిందలేయడం మొదలుపెట్టారు. 

ఇక అప్పట్నుంచి ఆయన బస్సు యాత్ర వరకూ ఇదే ట్రెండ్‌‌‌‌ను కొనసాగించారు. కేసీఆర్ కంటే ముందు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రజలు అత్యాశకు పోయిన్రు అని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించి తప్పు చేశారని, ఇప్పుడు తప్పు తెలుసుకుని బాధ పడుతున్నారని ఆయన అనేకసార్లు ప్రజలను నిందిస్తూ మాట్లాడారు. మరోసారి అదే తప్పు చేస్తే, ఇక ఎవరూ మిమ్మల్ని కాపాడలేరంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఓట్లు అభ్యర్థించడానికి బదులు ఇలాంటి హెచ్చరికలు, నిందలే ఆ పార్టీ నేతల ప్రసంగాల్లో కనిపించాయి.