కోడ్ కూయకముందే బీఆర్​ఎస్ నేతల పరుగో పరుగు

  • రోజుకు10 ప్రారంభోత్సవాలు.. 20 శంకుస్థాపనలు
  • పెండింగ్‌‌ పనుల ఓపెనింగ్​కు మంత్రులు, ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు
  • సమావేశాలు పెట్టి.. కారు గుర్తుకే ఓటేయాలని ప్రచారం

కరీంనగర్/నెట్‌‌వర్క్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్​ అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోజుకు10 పబ్లిక్ మీటింగ్ లు, 20 శంకుస్థాపనలు అన్నట్లుగా బిజీబిజీగా గడుపుతున్నారు. షెడ్యూల్ కు ముందే తమ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న వర్క్స్ కు శంకుస్థాపనలు, అక్కడక్కడ పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 

కార్యక్రమాలకు హాజరైన ప్రతి నాయకుడు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకోవడం, సమావేశాల్లో బీఆర్ఎస్ పాటలు, డీజే చప్పుళ్లు, కార్యకర్తల నినాదాలు, జనానికి బీఆర్ఎస్ అభ్యర్థుల అభివాదాలు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. శంకుస్థాపనలు చేయడం వరకు బాగానే ఉన్నా.‌‌. ఎన్నికల్లోపు పనులు పూర్తవుతాయా? శిలాఫలకాలకే పరిమితమవుతాయా అనే అనుమానం జనాల్లో వ్యక్తమవుతోంది. 

ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు

 మంత్రి హరీశ్ రావు గురువారం మెదక్​లోరూ.180 కోట్లతో చేపట్టే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. మెదక్ మున్సిపాలిటీలో రూ.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.60 కోట్లతో ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ఎరుకల ఎంపవర్ మెంట్ స్కీమ్ ను ప్రారంభించారు. రూ.2.50 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ సంస్థ బిల్డింగ్, రూ.50 లక్షలతో నిర్మించిన సఖి కేంద్ర బిల్డింగ్ ప్రారంభించారు.

 సిద్దిపేటలో మంగళవారం రైల్వే స్టేషన్ తో పాటు రైలు సర్వీసుల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 2న మెదక్ నియోజక వర్గంలోని రామాయంపేటలో కొత్త రెవెన్యూ డివిజన్ తోపాటు రూ.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

 పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఈ నెల 1న, రూ.134 కోట్లతో 14 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామగుండం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో  రూ.50 డివిజన్లలో అభివృద్ధి పనులు, రూ.60 కోట్లతో అంతర్గాంలో  ఇండస్ట్రియల్‌‌‌‌ పార్క్‌‌‌‌, రూ.30 కోట్లతో గోదావరిఖనిలో ఐటీ పార్క్‌‌‌‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌‌‌‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

 నిర్మల్ జిల్లాలోనూ మంత్రి కేటీఆర్​బుధవారం సుడిగాలి పర్యటన జరిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి ఒకేరోజు రూ.1,114 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఓపెనింగ్స్​ చేశారు.

గ్రేటర్ వరంగల్ లో శుక్రవారం మంత్రి కేటీఆర్ రూ.900 కోట్ల విలువ చేసే వివిధ పనులకు ఓపెనింగ్స్​, శంకుస్థాపనలు చేయనున్నారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సుమారు రూ.2.50 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ అలివేలు మంగ దేవాలయం దగ్గరి నుంచి కొండ మీదికి నిర్మించే రోప్ వే, స్కైవాక్, అన్నదాన సత్రం, వసతుల కోసం రూ.50 కోట్లతో చేపట్టిన నిర్మాణాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు. భూపాలపల్లి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నాలుగు రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.  

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, విప్ గంప గోవర్ధన్ ఈ నెల 1న ఒక్క రోజే 46 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభో త్సవాలు చేశారు. సిర్పూర్ నియోజక వర్గంలో 4 రోజులుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విరామం లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. రూ.25 కోట్లతో వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ, గ్రామాల్లో యువతకు  క్రీడాసామగ్రి ఇస్తున్నారు.

   సూర్యాపేటలో మంత్రి జగదీశ్​ రెడ్డి గురువారం ఒక్కరోజే 41 బిల్డింగులకు శంకుస్థాపన చేశారు. వీటితోపాటు చిదేళ్ల గ్రామంలో 10 టన్నుల కెపాసిటీ గల గోడౌన్,  దురాజ్ పల్లి లింగమంతుల స్వామి రాజ గోపుర నిర్మాణానికి గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు.

పెండింగ్ పనులకు.. 

ఎన్నికల ముందు చాలా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్లు, కమ్యూనిటీ హాళ్లు తదితర పనులకు, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. కరీంనగర్ సిటీలో ఒకేసారి రూ.133 కోట్లు సీఎం అస్యూరెన్స్ గ్రాంట్స్ తో చేపట్టిన166 పనులకు అక్టోబర్ 30 నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లైస్​ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు. 

కరీంనగర్ లో అడిగిన ప్రతి కాలనీలో సీసీ రోడ్లు శాంక్షన్ చేస్తున్నారు. గత ఆరు రోజులుగా రోజుకు 20కి పైగా పనులను ప్రారంభిస్తున్నప్పటికీ.. ఇంకా 40 వరకు పనులు మిగిలిపోయాయి.  మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్, హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.