యాదాద్రి, వెలుగు: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోవడం లేదు. సొమ్ము సర్కార్‌దే అయినా.. పార్టీకే లాభం కలగాలన్న ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా యువతకు స్పోర్ట్ కిట్స్ పంపిణీ ప్రారంభించింది. కిట్స్‌తో పాటు అందించే టీ షర్ట్‌పై కేసీఆర్ ఫొటో ముద్రించి మరీ అందిస్తున్నది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. యాదాద్రి జిల్లాలోని 17 మండలాలకు 473 స్పోర్ట్స్ కిట్స్ వచ్చాయి. ఉపాధి హామీ స్కీమ్ నిధులతో రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు నిర్మించి దాదాపు ఏడాదవుతున్నది.
ఇన్ని రోజులుగా నిరుపయోగంగా ఉన్న ఈ క్రీడా ప్రాంగాణాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. స్కూల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాంగణాలు మాత్రం స్టూడెంట్స్ ఆడుకుంటున్నందున బాగానే ఉన్నాయి. ఏడాదిపాటు క్రీడా ప్రాంగణాలు మరిచిపోయిన లీడర్లకు.. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో స్పోర్ట్ కిట్స్ పంపిణీ ప్రారంభమైంది. 33 జిల్లాల్లో 540 మండలాలు, 142 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన 17,289 క్రీడా ప్రాంగణాలకు 18 వేల స్పోర్ట్ కిట్స్ పంపిణీ చేయాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
23 క్రీడా పరికరాలు
23 క్రీడా పరికరాలతో స్పోర్ట్స్ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. రెండు క్రికెట్ బ్యాట్లకు తోడు ప్యాడ్లు, గ్లౌజెస్, వికెట్ కీపింగ్ గ్లౌజెస్, స్టంప్ట్స్, బాల్స్, ప్యాడ్లను క్రికెట్ కిట్‌లో ఉన్నాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్‌కు ఉన్న ఆదరణ దృష్టిలో పెట్టుకుని నాలుగు వాలీబాల్స్, రెండు నెట్స్, ఒక సైకిల్ పంప్, 30 కిలోల బరువుతో కూడిన మూడు వేర్వేరు డంబెల్స్, డిస్కస్ త్రో వంటి పరికరాలు కిట్‌లో ఉన్నాయి.