మట్కా విస్తరణకు బీఆర్ఎస్​ లీడర్ల అండదండ

మట్కా విస్తరణకు బీఆర్ఎస్​ లీడర్ల అండదండ
  •     జమీర్​ అరెస్ట్​తో తేలిన నిజం
  •     సీపీ చేతికి గులాబీ నేతల చిట్టా
  •     అరెస్ట్​ భయంతో బీఆర్​ఎస్​నేత పరార్

నిజామాబాద్, వెలుగు: ఏజెంట్లు, బుకీల ద్వారా మట్కా జూదాన్ని పెద్దఎత్తున నడిపిన మహ్మద్​ జమీర్​అరెస్ట్​ విచారణ కొందరు బీఆర్ఎస్​ లీడర్ల మెడకు చుట్టుకుంటోంది. గవర్నమెంట్​ తమదే అనే ధీమాతో మట్కా విస్తరణకు సహకరించిన సదరు నేతలను పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఒక మైనార్టీ లీడర్​ పరారీలో ఉన్నాడు. 

టాస్క్​ఫోర్స్​ టీమ్​తో వర్కవుట్​

నిజామాబాద్​ సిటీకి చెందిన మహ్మద్​ జమీర్​ మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వార్దా, అకోలా, అమరావతి తదితర ఏరియాలో మట్కా నిర్వాహకులతో బలమైన దోస్తానా ఏర్పర్చుకున్నాడు. వారి సాయంతో గెలిచే మట్కా నంబర్లను ప్రతిరోజూ ముందే తెలుసుకొని ఇక్కడ గేమ్​ షురూ చేసేవాడు. ఏజెంట్లు, బుకీలను నియమించుకొని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కోరుట్లల్లో దందా నడిపేవాడు. బెట్టింగ్​లూ నిర్వహించేవాడు. ఇలా రూ.కోట్లు సంపాదించాడని ఈ నెల 7న అతన్ని అరెస్ట్​ చేసిన టైమ్​లో ఏసీపీ కిరణ్​ కుమార్ ​వెల్లడించారు. ఐదేండ్ల నుంచి నడుస్తున్న అతడి దందా గురించి సీపీకి లీక్​అందడంతో ఆయన లోకల్​ పోలీసులను కాకుండా తన పరిధిలోని టాస్క్​ ఫోర్స్​ టీమ్​ను రంగంలోకి దింపి సక్సెసయ్యారు. 

బీఆర్ఎస్​ నేతలే సూత్రధారులు

బీఆర్ఎస్​కు చెందిన ఓ మైనార్టీ నేతతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతగా వ్యవహరించిన వ్యక్తి తమ్ముడు, గులాబీ కండువా ధరించే మరొకరు ఇన్నాళ్లూ మహ్మద్​ జమీర్​ దందాకు అండగా ఉన్నారని తేలింది. వారి హెల్ప్​తోనే మట్కా విస్తరించిందని పోలీసు విచారణలో కన్ఫర్మయ్యింది. ఇందుకు రూ.లక్షల నజరానాలు ముట్టాయని, పార్టీ ప్రోగ్రామ్​లకు ఈ డబ్బు ఖర్చు చేసేవారని నిర్ధారించారు.

పోలీస్​ విచారణలో తన పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసి మైనార్టీ నేత పారిపోగా, అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సదరు నేత పలువురిని బెదిరించి రూ.కోట్ల విలువైన ఆస్తులను తక్కువ రేటుకే కైవసం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మట్కా విస్తరణలో కీలకపాత్ర పోషించిన మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకునే ఛాన్స్​ ఉంది. మట్కా ద్వారా జమీర్​ కూడబెట్టిన ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.