కాంగ్రెస్​ పాట ఆపాలన్న బీఆర్ఎస్ లీడర్లు.. ప్రశ్నించిన కాంగ్రెస్​ లీడర్ ​హత్య​

  • కామారెడ్డి జిల్లాలో ఘోరం
  • పాత కక్షలతోనే చంపారన్న కుటుంబసభ్యులు

నస్రుల్లాబాద్ :  న్యూ ఇయర్​ వేడుకల్లో కాంగ్రెస్​పాట వద్దన్న బీఆర్ఎస్​ లీడర్లను ప్రశ్నించినందుకు ఓ కాంగ్రెస్​ నాయకుడిని చంపేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్​ మండలం నాచుపల్లిలో జరిగింది.  ఎస్ఐ లావణ్య కథనం ప్రకారం..గ్రామంలో న్యూ ఇయర్ ​సెలబ్రేషన్స్ నిర్వహించగా   యువకులు డీజే పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​కు సంబంధించిన పాట రావడంతో కొంతమంది బీఆర్ఎస్​లీడర్లు అక్కడికి చేరుకొని సాంగ్​ను ఆపాలని  పట్టుబట్టారు. అక్కడే ఉన్న కాంగ్రెస్​ లీడర్​ సాదుల రాములు పాట ఎందుకు ఆపాలని ప్రశ్నించాడు. దీంతో బీఆర్ఎస్ ​లీడర్లు వాగ్వాదానికి దిగారు.

కాసేపటికి గొడవ సద్దుమణిగి అందరూ వెళ్లిపోయారు. మళ్లీ గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ దగ్గర బీఆర్ఎస్​ లీడర్లు వినోద్​కుమార్, రవి, గోపాల్, అనిల్, కాంగ్రెస్​లీడర్​ రాములతో గొడవ పెట్టుకున్నారు. రాములును తోసేయగా కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్​ రెడ్డి, బాన్సువాడ రూరల్​ సీఐ మురళీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ లావణ్య తెలిపారు. పాత కక్షల కారణంగానే రాములును బీఆర్ఎస్​ లీడర్లు చంపారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. రాములు మృతికి కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అంతవరకు డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం పంపేది లేదంటూ  కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పారదర్శకంగా కేసును విచారించి నేరస్తులకు శిక్ష పడేలా చూస్తానని డీఎస్పీ జగన్నాథ్​రెడ్డి హామీ ఇవ్వడంతో  ఆందోళన విరమించారు.