- ఊరికే రాలే.. బతిమిలాడితే వచ్చామన్న మాజీ ఎమ్మెల్యే
- జగదీశ్ రెడ్డి తమకు పట్టిన శని అన్న మండల అధ్యక్షుడు
యాదాద్రి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్‌లలో క్యాడర్, లీడర్స్ రివర్స్ అవుతున్నారు. పవర్లో ఉన్నన్నాళ్లు తమను పట్టించుకోలేదని, అందుకే ఓడిపోయారని దెప్పిపొడుస్తున్నారు. మూడు రోజుల కింద భువనగిరిలో స్టేజ్మీదనే బీఆర్ఎస్లో ఆత్మీయత లేదు.. ఎవరినీ పట్టించుకోలేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా యాదగిరిగుట్టలోనూ ఇదే సీన్ రిపీటైంది. పార్టీలోకి ఉత్తగనే రాలేదని, పదవులు ఇస్తామని బతిమిలాడితే వచ్చామని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ స్పష్టంచేశారు. కార్యకర్తలు, నాయకులను చిన్నచూపు చూడడంతోనే పార్టీ ఓడిందని వ్యాఖ్యనించారు. మాజీమంత్రి జగదీశ్ రెడ్డి తమకు శనిలా దాపురించారని గుట్ట మండల అధ్యక్షుడు ఘాటు కామెంట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
మాజీ డిప్యూటీ సీఎం ముందే..
ఆలేరు నియోజకవర్గంపై సోమవారం యాదగిరిగుట్టలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు. ఆయన ఎదుటే కొందరు మండల స్థాయి లీడర్లు బీఆర్ఎస్‌ను కడిగి పారేశారు. గుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తమకు శనిలా దాపురించారని ఆరోపించారు.
తమను, తమ కష్టాలను ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈవో గీతపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారంలో ఉండి కూడా ఆమె కారణంగా మాటలు పడ్డామని వాపోయారు. జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు మాటలంటే అందరూ ఆయనను పరామర్శించారని, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన ఇళ్లు కూలగొట్టిస్తే ఒక్కరూ పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరామర్శలు పెద్దోళ్లకేనా.. తమకు ఉండవా అని ప్రశ్నించారు. యాదగిరిగుట్టకు కేసీఆర్ 23 సార్లు వచ్చినా.. ఏ ఒక్కసారి కూడా తమను ఆయనతో కలవనీయ లేదని ఇంకొందరు లీడర్లు మండిపడ్డారు. క్యాడర్‌ను లైట్ తీసుకోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని అభిప్రాయపడ్డారు.
పిలిచి బతిమిలాడితే వచ్చా:బూడిద భిక్షమయ్య గౌడ్
కార్యకర్తలు, నాయకులను చిన్నచూపు చూడడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరులో బీఆర్ఎస్ ఓడిందని మాజీ ఎమ్మెల్యే బూడి భిక్షమయ్య అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు భువనగిరి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓసీలతో పాలిస్తామని చెబుతోందని, బీఆర్ఎస్ అలా చేయదని అనుకుంటున్నామని సున్నితంగా హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తనకు తానుగా బీఆర్ఎస్ లోకి రాలేదని, పిలిచి బతిమిలాడి, సముచిత స్థానం కల్పిస్తాంటే వచ్చానని స్పష్టం చేశారు.
అహంకారం పెరిగిపోవడం తోనే: కంచర్ల రామకృష్ణారెడ్డి
అహంకారం, అహంభావం పెరిగిపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓడిందని బీఆర్‌ఎస్ యాదాద్రి జిల్లా ప్రెసిడెట్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గెలుపు తమదేనని ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి గ్రౌండ్ లెవల్‌లో సరిగా పనిచేయలేదన్నారు. రెండోసారి గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి, ఉద్యమకాలం నుంచి పనిచేసిన వారికి కేర్ చేయకపోవడం కూడా ఇవ్వడం ఓటమికి కారణమైందన్నారు.
అతివిశ్వాసమే కొంప ముంచింది: గొంగిడి సునీత
ఆలేరులో 2014, 2018లో భారీ మెజారిటీతో గెలిచినా.. మూడోసారి అతివిశ్వాసం కొంపముంచిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అభిప్రాయపడ్డారు. ఆలేరులో బీఆర్ఎస్ కు 94 వేల సభ్యత్వాలు ఉంటే ఎన్నికల్లో మాత్రం 74 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. పార్టీలోనే ఉంటూ ఎవరు మోసం చేశారో.. ఎవరు అండగా నిలిచారో తెలిసొచ్చిందన్నారు. ఓడిపోగానే పార్టీలో నుంచి తాలు మొత్తం పోయి అసలైన గింజలు మిగిలాయన్నారు.